జాధవ్‌ను కలిసిన భారత రాయబారి

Indian diplomat meets Kulbhushan Jadhav after Pak grants consular access - Sakshi

న్యూఢిల్లీ: మరణశిక్ష పడి పాక్‌ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌(49)ను భారత సీనియర్‌ దౌత్యాధికారి ఒకరు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా జాధవ్‌తో భారత దౌత్యాధికారి కాసేపు చర్చించారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు కుల్‌భూషణ్‌ జాధవ్‌ను సెప్టెంబర్‌ 2వ తేదీన భారత దౌత్య అధికారులు కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహ మ్మద్‌ ఫైసల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాన్సులర్‌ అనుమతి లభించడంతో ఓ భారత దౌత్యాధికారి సోమవారం జాధవ్‌ను కలిశారని పాక్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యున్‌ పత్రిక తెలిపింది. అయితే, జాధవ్‌ను కలిసిన దౌత్యాధికారి ఎవరు? వారు ఎక్కడ సమావేశమయ్యారనే వివరాలు వెల్లడించలేదు. 

గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్‌ జాధవ్‌కు పాక్‌ విధించిన మరణ దండనను జూలై 18న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కులభూషణ్‌ విషయంలో పాక్‌ వ్యవహరించిన తీరును ఐసీజే తీవ్రంగా తప్పుబట్టింది. వియాన్నా ఒప్పందం ప్రకారం కులభూషణ్‌ జాధవ్‌ను కలిసేందుకు దౌత్యాధికారులకు అనుమతిని పాక్‌ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు 15 రోజుల అనంతరం పాక్‌ దిగొచ్చింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియాన్నా ఒప్పందంలోని ఆర్టికల్‌ 36, పారాగ్రాఫ్‌ 1 (బీ) ప్రకారం కులభూషణ్‌కు తన హక్కులు తెలియజేశామని, బాధ్యతాయుతమైన దేశంగా ఆయనను కలిసేందుకు దౌత్యాధికారుల అనుమతిని జారీచేశామని పాక్‌ విదేశాంగ శాఖ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top