‘ఎన్నారై ప్రయోజనాలను దెబ్బ తీయొద్దు’

India Urges US To Take 'Balanced, Sensitive' View On H-1B Visa Issue - Sakshi

న్యూఢిల్లీ : హెచ్‌-1బీ వీసాల విషయంలో ఇటీవల ట్రంప్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన వైఖరి తెలిసిందే. దీంతో అమెరికా వెళ్తున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న 2 ప్లస్‌ 2 చర్చల్లో హెచ్‌-1బీ వీసాల విషయంలో ఎదురవుతున్న సమస్యలను భారత్‌, అమెరికా ప్రభుత్వం ముందు ఉంచింది. హెచ్‌-1బీ వీసాల విషయంలో ఎన్నారైల ప్రయోజనాలను దెబ్బ తీయొద్దని అమెరికా ప్రభుత్వాన్ని, భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ కోరారు. అమెరికా, భారత్‌ల మధ్య బలమైన సంబంధాలున్నాయని, హెచ్‌-1బీ వీసాల్లో ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణితో భారతీయులు నష్టపోతున్నట్టు పేర్కొన్నారు. ఇరు దేశాల సంబంధాల దృష్ట్యా హెచ్‌-1బీ విషయంలో సున్నితంగా, సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. విదేశాంగ, రక్షణ శాఖలతో హాట్‌లైన్‌ ఏర్పాటుకు తాము సిద్ధమని చెప్పారు. 

తొలిసారి జరుగుతున్న 2 ప్లస్‌ 2 చర్చల్లో సుష్మా స్వరాజ్‌తో పాటు, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైఖేల్‌ పాంపీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, అమెరికా రక్షణ కార్యదర్శి జేమ్స్‌ మాటిస్‌ పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్నేహం నేపథ్యంలో, తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికా ఏమీ చేయదని భారతీయులు భావిస్తూ ఉంటారని సుష్మా స్వరాజ్‌ చెప్పారు. ఇదే విశ్వాసాన్ని ప్రజలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మైఖేల్‌ పాంపీని కోరినట్టు సుష్మా స్వరాజ్‌ తెలిపారు. ప్రతిభావంతులైన భారతీయులను నియమించుకునేందుకు అమెరికాలోని టెక్‌ కంపెనీలకు హెచ్‌-1బీ వీసా ఎంతో కీలకం. టెక్నాలజీ కంపెనీలు ఎక్కువగా దీనిపైనే ఆధారపడి ఉంటాయి. ప్రతేడాది వేలకొద్దీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కానీ ఐటీ కంపెనీలకు ఝలకిస్తూ.. హెచ్‌-1బీ సిస్టమ్‌లో ట్రంప్‌ ప్రభుత్వం పలు మార్పులను తీసుకొస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top