ఆందోళన చెందుతున్నా: ఇమ్రాన్‌ ఖాన్‌

Imran Khan Says Not Interested In Dialogue With India - Sakshi

ఇస్లామాబాద్‌ : ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌తో చర్చలు జరిపే అవకాశమే లేదని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టం చేశారు. ఇరు దేశాల్లో శాంతి స్థాపన కోసమై చర్చలు జరగాలని తాను ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందన్నారు. తన మాటలు, అనుసరించే విధానాలు భారత్‌కు నచ్చినట్టుగా లేవని.. ఇంతకు మించి తాను ఏమీ చేయలేనని వ్యాఖ్యానించారు. అయితే అణ్వాయుధాలు కలిగి ఉన్న దాయాది దేశాల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న యుద్ధ వాతావరణం తనను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌ విధానాలను ప్రశ్నించాల్సిందిగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అంతర్జాతీయ సమాజాన్ని కోరిననప్పటికీ ఫలితం లేకపోయింది. 

ఈ నేపథ్యంలో మిత్ర దేశం చైనాను ఒప్పించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్‌ అంశంపై రహస్య సమావేశం నిర్వహించినప్పటికీ పాక్‌కు భంగపాటు తప్పలేదు. ఈ క్రమంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే యోచనలో ఉన్నట్లు పాక్‌ తెలిపింది. అయితే యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇమ్రాన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ... కశ్మీర్‌ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దీంతో జాగ్రత్తగా మాట్లాడాలంటూ ట్రంప్‌ ఇమ్రాన్‌ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యూయార్క్‌ టైమ్స్‌తో మాట్లాడిన ఇమ్రాన్‌ ఇక భారత్‌తో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top