అమెరికా జనాభాలో 14% విదేశీయులే

Immigrants Are Increasing In America - Sakshi

ఏడేళ్లలో రెట్టింపయిన వలసదారులు

వారిలో అత్యధికులు భారతీయులే

వలసదారులను నియంత్రించేందుకు ఒకవైపు ట్రంప్‌ సర్కారు శత విధాల ప్రయత్నిస్తోంటే మరోవైపు దేశంలో వలసదారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది.అమెరికా జనాభా లెక్కల కేంద్రం గత వారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 14శాతం వలసదారులు(విదేశీయులు)ఉన్నారు. అంటే ప్రతి ఏడుగురు అమెరికన్లలో ఒకరు విదేశీయుడన్నమాట.ఈ వలసదారుల్లో చట్టబద్ధంగా వచ్చిన వారు, అక్రమంగా వచ్చిన వారు కూడా ఉన్నారు. దేశ జనాభాలో 14శాతం వలసదారులు ఉండటం ఈ శతాబ్దంలోనే రికార్డు అని సెంటర్‌ ఫర్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టడీస్‌(సిఐఎస్‌) పేర్కొంది. 2016లో అమెరికాలో విదేశీ జనాభా 8 లక్షలు పెరిగింది . 2017,జులై నాటికి దేశంలో మొత్తం 4.45 కోట్ల మంది వలసదారులు ఉన్నారు. 1980 లెక్కల ప్రకారం ప్రతి 16 మంది అమెరికన్లలో ఒకరు విదేశీయుడు కాగా ఇప్పుడది రెట్టింపు అయింది.

2010 –2017 మధ్య అమెరికాకు వలస వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ మంది భారతీయులేనని, ఈ ఏడేళ్లలో  8.30 లక్షల మంది భారతీయులు(47% పెరుగుదల) అమెరికా వెళ్లారని సీఐఎస్‌ నివేదిక వెల్లడించింది. తర్వాత స్థానాల్లో చైనా (6.77 లక్షలు–31%),డొమినికన్‌ రిపబ్లిక్‌(2.83 లక్షలు–32%) ఉన్నాయి.ఈ కాలంలో నేపాల్‌ వలసదారులు 120% పెరిగారు. 2017, జులై నాటికి అమెరికాలో 1.52 లక్షల మంది నేపాలీలు ఉన్నారు.పాకిస్తాన్‌ నుంచి  4 లక్షల మంది అమెరికా వెళ్లినట్టు్ట సీఐఎస్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.2010–17 మధ్య 95 లక్షల మంది కొత్త వలసదారులు అమెరికాలో స్థిరపడ్డారు.ఏటా దాదాపు 3 లక్షల మంది వలసదారులు స్వదేశం వెళ్లిపోతున్నారు.మరో 3 లక్షల మంది చనిపోతున్నారు.

అమెరికా జనాభా లెక్కల కేంద్రం నిర్వచనం ప్రకారం విదేశీయులంటే జన్మతః అమెరికన్లు కానివారు.అమెరికా వచ్చి ఆ తర్వాత పౌరసత్వం, గ్రీన్‌కార్డు పొందిన వారు, హెచ్‌1బీ వీసాదారులు, విదేశీ విద్యార్థులను కూడా వలసదారులుగానే పరిగణిస్తారు.

ఇటీవల కొంత కాలంగా ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న వర్క్‌ వీసాల సంఖ్యను తగ్గించడం, తాత్కాలిక కార్మికుల వీసా గడువు పొడిగించకపోవడం, విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడం,అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపేయడం వంటి చర్యల ఫలితంగా రాబోయే సంవత్సరాల్లో దేశంలో విదేశీయుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని సీఐఎస్‌ పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top