
వారు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాదు!
బంగ్లాదేశ్లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు కాదని బంగ్లా ప్రభుత్వం వెల్లడించింది
ఢాకా: బంగ్లాదేశ్లో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు కాదని బంగ్లా ప్రభుత్వం వెల్లడించింది. ఢాకాలోని ఓ హోటల్లో 20 మందిని అత్యంత క్రూరంగా గొంతుకోసి హతమార్చిన ఉగ్రవాదులకు.. ఇస్లామిక్ స్టేట్తో ఎలాంటి సంబంధాలు లేవని హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు 'జమైతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్' సంస్థకు చెందిన వారుగా వెల్లడించారు.
అయితే ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇద్దరు పోలీసులతో సహా.. బందీలను హతమార్చింది తామేనని ఐఎస్ చెప్పుకుంది. అయితే దీనిని బంగ్లాదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి తోసిపుచ్చుతూనే ఉంది. ఉగ్రదాడికి పాల్పడిన వారి ఫోటోలు, వివరాలను పోలీసులు విడుదల చేశారు. దాడికి పాల్పడిన ఆరుగురు ఉగ్రవాదులు పోలీసుల ఆపరేషన్లో మృతి చెందగా.. ఒకరిని అరెస్ట్ చేశారు. అధికారులు అతడిని విచారిస్తున్నారు. ఉగ్రవాదులంతా బాగా చదువుకున్న, సంపన్న వర్గానికి చెందిన యువకులుగా ఖాన్ వెల్లడించారు.