మే 11 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు: ఫ్రాన్స్‌

France Extends Lockdown Till May 11 Amid Covid 19 Outbreak - Sakshi

పారిస్‌: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభిస్తున్న నేపథ్యంలో యూరప్‌ దేశం ఫ్రాన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసేందుకు మే 11 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత దశల వారీగా విద్యా, వ్యాపార సంస్థలు తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపడతామని వెల్లడించింది. అదే విధంగా జూలై ద్వితీయార్థం వరకు బహిరంగ కార్యక్రమాలకు అనుమతినివ్వబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘కరోనా నెమ్మదిస్తుందని భావిస్తున్నాం. ఆశలు చిగురిస్తాయి. మే 11 తర్వాత కొత్త దశ ప్రారంభమవుతుంది. ఫలితాలను అంచనా వేస్తూ క్రమక్రమంగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలనుకుంటున్నాం’’అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. (కరోనా: అమెరికా కంటే అధ్వాన్నంగా..)

కాగా కరోనా ఉధృతి రోజురోజుకీ పెరిగిపోతున్న తరుణంలో ఒకేసారి కాకుండా.. నియంత్రణ చర్యలు, నిబంధనలను దశల వారీగా ఎత్తివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విషయం తెలిసిందే. ప్రాణాంతక వైరస్‌ను సమూలగా నాశనం చేయాలంటే అందుకు తగిన వ్యాక్సిన​ సాధ్యమైనంత త్వరగా కనిపెట్టాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక యూరప్‌లో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. కరోనా మరణాల సంఖ్య ఇటలీలో 20 వేలు దాటగా.. స్పెయిన్‌లో 17 వేలు దాటింది. అయితే కరోనా కేసుల సంఖ్యలో పెరుగదల కాస్త  తగ్గుముఖం పట్టడంతో స్పెయిన్‌ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే ప్రయత్నాలపై దృష్టిసారించింది. రెండు వారాల తర్వాత నిర్మాణరంగ కార్మికులు సోమవారం నుంచి పనుల్లో చేరారు. ఇక సోమవారం ఒకేరోజు ఫ్రాన్స్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో మార్చి 17న విధించిన లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.(చైనాను మించిన న్యూయార్క్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top