ట్రంప్‌ బుర్ర గట్టిదే..!

Donald Trump's in Good Health, White House Doctor Says  - Sakshi

అధ్యక్షుడికి పరీక్షలో 30కి 30 పాయింట్లు

ఫలితాలను వెల్లడించిన శ్వేతసౌధం వైద్యుడు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(71) మానసిక ఆరోగ్యంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో శ్వేతసౌధం వైద్యుడు డా.రానీ జాక్సన్‌ అధ్యక్షుడికి జరిపిన పరీక్షా ఫలితాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. ట్రంప్‌ మానసిక స్థితి సరిగానే ఉందనీ, ఈ పరీక్షల్లో ట్రంప్‌ 30కి 30 పాయింట్లు సాధించారని తెలిపారు. జంక్‌ ఫుడ్‌ తీసుకున్నా ఆరోగ్యంగా ఉండటానికి ట్రంప్‌ జన్యువులే కారణమన్నారు. గత 20 ఏళ్లలో మరింత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని ఉంటే మరో 200 ఏళ్లు బతికేవారని తాను ట్రంప్‌తో చెప్పినట్లు జాక్సన్‌ వెల్లడించారు.

మాంట్రియల్‌ కాగ్నిటివ్‌ అసెస్‌మెంట్‌ పేరిట దేశాధ్యక్షుడికి ఉన్న ఏకాగ్రత, మనసును లగ్నంచేసే తీరు, జ్ఞాపకశక్తి, భాష, గణన సామర్థ్యం వంటి అనేక అంశాలపై ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో మెదడు పనితీరుకు సంబంధించి ట్రంప్‌నకు సమస్యలేవీ లేవని తేలిందన్నారు. ట్రంప్‌ స్వయంగా కోరడంతోనే ఈ పరీక్షను నిర్వహించినట్లు డా.జాక్సన్‌ స్పష్టం చేశారు. ఈ పరీక్షలో 30కి 26 పాయింట్లు వస్తే మెదడు సక్రమంగా పనిచేస్తున్నట్లేనని తెలిపారు. ఇటీవల విడుదలైన పుస్తకం ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ’లో అధ్యక్షుడి మానసిక ఆరోగ్యంపై ఆయన సహాయకులకే అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ మెడికల్‌ సెంటర్‌లో సైనిక వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. 6.3 అడుగుల ఎత్తున్న ట్రంప్‌ 108 కిలోల బరువున్నారని జాక్సన్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top