ఆ డ్రగ్‌ వాడుతున్నా.. అవన్నీ వట్టి మాటలే: ట్రంప్‌

Donald Trump says He Is Taking Hydroxychloroquine Amid Covid 19 - Sakshi

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) నుంచి తనను తాను రక్షించుకోవడానికి యాంటీ మాలేరియా డ్రగ్‌ తీసుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. పదిరోజులుగా హైడాక్సీక్లోరోక్విన్‌, జింక్‌ సంప్లిమెంట్‌ తీసుకుంటున్నానని సోమవారం విలేకరులతో పేర్కొన్నారు. కాగా కరోనా పేషెంట్లకు ఉపశమనం కలిగించడంలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సత్ఫలితాలను ఇస్తుందన్న వార్తల నేపథ్యంలో తమకు ఈ డ్రగ్‌ను ఎగుమతి చేయాల్సిందిగా ట్రంప్‌ భారత్‌ను కోరిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం ఈ ఔషధం కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అంతగా ప్రభావం చూపడం లేదని, పైపెచ్చు దీని వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని ట్రంప్‌ యంత్రాంగంలోని పలువురు వైద్య నిపుణులు హెచ్చరించారు. (ఒబామాపై విమ‌ర్శ‌లు గుప్పించిన ట్రంప్‌)

ఈ క్రమంలో ట్రంప్‌ సైతం అదే బాటలో నడిచారు. హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ పరమౌషధమని తొలుత చెప్పుకొచ్చిన ట్రంప్‌ ఆ తర్వాత అతినీలలోహిత కిరణాలు కోవిడ్‌-19 చికిత్సకు ఉపకరిస్తాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం రెమిడిసివిర్‌ మందు కరోనా చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఇక తాజాగా శ్వేతసౌధంలోని పలువురు సిబ్బందికి కరోనా సోకిందని తేలిన నేపథ్యంలో తాను హైడ్రాక్వీక్లోరోక్విన్‌ వాడుతున్నానంటూ ట్రంప్‌ ప్రకటించడం విశేషం. అయితే ఈ ఔషధాన్ని వాడమని తన వ్యక్తిగత వైద్యులు సూచించలేదని, వైట్‌హౌజ్‌ ఫిజీషియన్‌ ద్వారా దీనిని తెప్పించుకున్నానని పేర్కొన్నారు. (భారతీయులు భళా: ట్రంప్‌)

ఈ డ్రగ్‌ బాగా పనిచేస్తుందని తాను భావిస్తున్నానని... దీని వల్ల ఎంతో మంది కోవిడ్‌ నుంచి కోలుకున్న స్ఫూర్తివంతమైన కథలు తాను విన్నానంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని.. తాను బాగానే ఉన్నా కదా అంటూ వారిని ఎదురు ప్రశ్నించారు. కాగా కరోనా విస్తృతమైన నేపథ్యంలోనూ తాను మాస్కు ధరించనంటూ ట్రంప్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక కరోనా సాధారణ ఫ్లూ వంటిదేనని.. దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇక లక్షలాది మంది కరోనా బారిన పడుతున్న తరుణంలోనే తిరిగి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించి లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారు.   (ఆంటొని చాలా మంచివారు.. కానీ: ట్రంప్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top