భారత ఐటీ నిపుణుల నెత్తిన పిడుగు | Sakshi
Sakshi News home page

భారత ఐటీ నిపుణుల నెత్తిన పిడుగు

Published Fri, Jun 12 2020 1:44 PM

Donald Trump may suspend H-1B visas: Report - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ /వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌1బీ వీసాలకు సంబంధించి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. కరోనా వైరస్ మహమ్మారి, లాక్‌డౌన్‌  కారణంగా దేశంలో నిరుద్యోగం రేటు రికార్డు స్థాయికి చేరడంతోపాటు, వలసలను నిరోధించడానికి ఈ నిర్ణయంవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. హెచ్‌1బీ సహా పలు రకాల వర్క్‌ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు, ఉద్యోగాల్లో అమెరిన్లకే ప్రాధాన్యత లభిస్తుందని ట్రంప్ సర్కార్ భావిస్తున్నట్టు మీడియా నివేదికల సారాంశం. 

హెచ్1బీ వీసా, ఇతర  వర్క్ వీసాలను నిలిపివేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్‌ నివేదించింది. దీని  ప్రకారం హెచ్ 1బీ వీసాతో పాటు, హెచ్ 2బీ వీసా, జే1, ఎల్1 వీసాలను కూడా నిలిపివేయవచ్చు. దీంతో సుమారు లక్ష మందికి పైగా ప్రభావితం కానున్నారని తెలిపింది. అయితే ఇప్పటికే హెచ్1బీ వీసా ఉన్నవారు ప్రభావితం అయ్యే అవకాశం లేదని పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ఈ నిషేధం ఎత్తివేసేంతవరకు భారతీయ ఐటీ నిపుణుల 'గ్రేట్ అమెరికన్ డ్రీం'కు చెక్ పడినట్టేననే ఆందోళన వ్యక్తమవుతోంది. 

అలాగే హెచ్1బీ వీసాదరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుండి 20వేల డాలర్లకు పెంచే ప్రతిపాదననకూడా ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతోపాటు ఒబామా తీసుకొచ్చిన  హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అనుమతినిచ్చే హెచ్‌4 వీసాలపైకూడా  బ్యాన్ విధించాలని  భావిస్తోందట.

అమెరికన్ నిపుణులు, ఇతర ఉద్యోగార్ధులు, ముఖ్యంగా వెనుకబడిన, తక్కువ వయస్సు గల అమెరికా పౌరులను రక్షించడానికి కెరీర్ నిపుణుల వివిధ సూచనలను పరిశీలిస్తోందని,  ఈ అంశంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని వైట్ హౌస్ ప్రతినిధి హొగన్ గిడ్లీ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement