వ్యాక్సిన్‌: ముందు వరుసలో ఆ 3 కంపెనీలు! | Covid 19 Vaccine Unlikely Before 2021 Current Situation | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌: ముందు వరుసలో ఆ 3 కంపెనీలు!

Jul 11 2020 2:34 PM | Updated on Jul 11 2020 7:48 PM

Covid 19 Vaccine Unlikely Before 2021 Current Situation - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 12 మిలియన్ల మంది మహమ్మారి బారిన పడగా.. సుమారు 70 లక్షల మంది కోలుకున్నారు. ఐదున్నర లక్షల మంది కరోనాతో మృతి చెందారు. ఇక కోవిడ్‌-19 విజృంభించిన నాటి నుంచి వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 కోవిడ్‌-19 వ్యాక్సిన్లు ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నాయి. వాటిలో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ తుది దశకు చేరుకోగా.. అమెరికాకు చెందిన బయోటెక్‌ సంస్థలు గిలియాడ్‌ సైన్సెన్‌, మాడెర్నా కూడా క్లినికల్‌ ట్రయల్స్‌ వేగవంతం చేశాయి.

ఈ నేపథ్యంలో యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమెడిసివిర్‌ ఉపయోగించడం వల్ల కోవిడ్‌ మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని అమెరికా ఔషధ దిగ్గజం గిలియాడ్ సైన్సెస్ మరోసారి స్పష్టం చేసింది. తీవ్రమైన లక్షణాలతో బాధ పడుతున్న కరోనా పేషెంట్లకు ఈ డ్రగ్‌ ఇవ్వడం ద్వారా మరణం అంచున ఉన్న వారిని కాపాడుకోవచ్చని శుక్రవారం తెలిపింది. అయితే క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తిస్థాయిలో విజయవంతమైన తర్వాతే రెమిడిసివిర్‌ ఉపయోగాలు ఎలా ఉంటాయన్నది తేలుతుందని స్పష్టం చేసింది. 

అదే విధంగా జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సే కంపెనీ తాము రూపొందించిన వ్యాక్సిన్‌కు ఈ ఏడాది చివర్లోగా ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తాము తయారు చేసిన బీఎన్‌టీ162బీ1 అనే వ్యాక్సిన్‌ ప్రస్తుతం ప్రాథమిక దశలో అద్భుత ఫలితాలనిచ్చిందని, దాదాపు 30 వేల మందిపై ట్రయల్స్‌ నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు వెల్లడించింది. 

ఇక భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షలకు చేరువైన తరుణంలో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది ప్రారంభంలో సిద్ధమయ్యే అవకాశం ఉందని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ విభాగం, సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ముఖ్య సాంకేతిక సలహాదారు గురువారం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి తెలియజేశారు. కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ అధ్యక్షతన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై  ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం శుక్రవారం పార్లమెంట్‌ ప్రాంగణంలో సమావేశమైంది. దేశంలో కరోనా తాజా పరిస్థితిపై చర్చించారు.

కాగా కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు తమ నేతృత్వంలో రూపొందుతున్న వ్యాక్సిన్‌ బాగా పని చేస్తుందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రతినిధులు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ స్వల్ప లక్షణాలు కలిగిన వారికి ప్రస్తుతం జబ్బు నయం అయినా మరోసారి కరోనా వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. తమ ఫార్ములాతో తయారైన వాక్సిన్‌ వల్ల మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి కొన్నేళ్ల పాటు అది శరీరంలో ఉండిపోతుందని, కరోనా మళ్లీ ఎప్పుడు దాడి చేసినా ఎదుర్కోగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా మందుల తయారీ కంపెనీ అస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో జెన్నర్‌ ఇనిస్టిట్యూట్‌ రూపొందిస్తున్న ChAdOx1 nCoV-19 అనే ఈ వ్యాక్సిన్‌ కోతులపై సానుకూల ఫలితమివ్వడం తెల్సిందే. మరోవైపు క్ష‌య వ్యాధి నివార‌ణ‌కు ఉపయోగించే బీసీజీ (కాల్మెట్-గురిన్ ) వ్యాక్సిన్ ద్వారా కోవిడ్ మ‌ర‌ణాల రేటు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు ప‌రిశోధ‌న‌ల్లో తేలిందని శాస్త్రవేత్తలు గురువారం తెలిపారు. ఈ మేరకు నేషనల్‌ అకాడమీ  ఆఫ్‌ సైన్సెస్‌లో తాజా అధ్యయనం ప్రచురించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement