స్వీయ నిర్బంధం ఉల్లంఘన.. భారీ జరిమానా!

Coronavirus: First British Arrest after Man Breaks Quarantine - Sakshi

లండన్‌: బ్రిటన్‌ క్రౌన్‌ డిపెండెన్సీ(బ్రిటన్‌ రాజ్యాంగానికి లోబడిన స్వయం పాలిత దేశం)గా వ్యవహరించే ‘ఐజిల్‌ ఆఫ్‌ మాన్‌’ దీవిలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన ‘స్వీయ నిర్బంధం’ ఆంక్షలను ఉల్లంఘించిన 26 ఏళ్ల యువకుడిని శుక్రవారం ఐజిల్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. మెర్సిసైడ్‌ నుంచి ఐజిల్‌కు పడవలో వచ్చిన ఆ యువకుడికి పది వేల పౌండ్లు (దాదాపు 9 లక్షల రూపాయలు) జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఆ యువకుడి పేరును మాత్రం అక్కడి పోలీసు అధికారులు వెల్లడించలేదు. (కోవిడ్‌-19: చైనా కంపెనీ సరికొత్త రికార్డు!)

బ్రిటన్‌లో కేఫ్‌లు, పబ్‌లు, నైట్‌ క్లబ్‌లు, రెస్టారెంట్లను మూసివేసినప్పటికీ ‘కోవిడ్‌’ పరిస్థితి అదుపులోకి రాకపోవడమే కాకుండా మృతుల సంఖ్య దాదాపు 150కి చేరుకోవడంతో 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా ప్రజలందరిని ఆదేశిస్తూ బ్రిటన్‌ గురువారం నాడు కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి పదివేల పౌండ్ల జరిమానా, మూడు నెలల జైలు విధించాలని చట్టంలో పేర్కొన్నారు. అయితే ఆఖరి ఆయుధంగా మాత్రమే దీన్ని ప్రయోగించాలంటూ బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి మాట్‌ హాన్‌కాక్‌ పోలీసులకు పిలుపునివ్వడంతో బ్రిటన్‌లో ఈ చట్టం కింద ఇంతవరకు ఎవరిని అరెస్ట్‌ చేయలేదు. ఐజిల్‌కు కూడా వర్తించే ఈ చట్టం కింద అక్కడ తొలి అరెస్ట్‌ నమోదయింది. ఐజిల్‌తోపాటు జెర్సీ, గెర్న్‌సీ అనే మరో రెండు స్వయం పాలిత దేశాలు బ్రిటన్‌ క్రౌన్‌ డిపెండెన్సీ కిందకు వస్తాయి. ఇవి ఒకప్పుడు బ్రిటన్‌ పాలిత దేశాలు కావు. ఇతర కారణాల వల్ల బ్రిటన్‌ రాజ్యాంగం పరిధిలోకి వచ్చిన దేశాలు. (2 లక్షలు దాటిన కరోనా కేసులు..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top