చైనా దొంగబుద్ధి బట్టబయలు
చైనా నేవీలో పనిచేసేవారికున్న సోయి చైనా పెద్దలకు లేకుండా పోయింది. ఆడెన్ సింధూశాఖలో సముద్రపు దొంగలు హైజాక్ చేసిన భారీ వాణిజ్య నౌకను భారత్, చైనా నేవీ సేనలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి రక్షించాయి.
బీజింగ్: చైనా నేవీలో పనిచేసేవారికున్న సోయి చైనా పెద్దలకు లేకుండా పోయింది. ఆడెన్ సింధూశాఖలో సముద్రపు దొంగలు హైజాక్ చేసిన భారీ వాణిజ్య నౌకను భారత్, చైనా నేవీ సేనలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి రక్షించాయి. ఈ ఆపరేషన్ పూర్తయిన వెంటనే చైనా ఆర్మీకి చెందిన అధికారులు ధన్యవాదాలు చెప్పారు. కానీ, చైనా విదేశాంగ అధికార ప్రతినిధులు మాత్రం భారత్ సాయాన్ని మర్చిపోయారు. తామొక్కరమే భారీ వాణిజ్య నౌకను రక్షించినట్లు డంబాలు పలికారు.
చైనా విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి హువా చునియింగ్ అధికారిక ప్రకటన చేస్తూ చైనా నేవీ దళం సముద్రపు దొంగలపై ప్రభావవంతమైన పోరాటతెగువను చూపింది అని ప్రకటించారు. ఆ ఆపరేషన్‌లో భారత నేవీనే ముందుస్పందించిందికదా, సాయం చేసింది కదా అని ప్రశ్నించగా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. తామే మొత్తం సహాయం చేసినట్లుగా ప్రకటించుకున్నారు. దీంతో మరోసారి చైనా కపటబుద్ధి బయటపడినట్లయింది.
తువాలుకు చెందిన భారీ వాణిజ్య నౌక ఒకటి పిలిప్పీన్స్‌కు చెందిన వారితో మలేషియా నుంచి గల్ఫ్ ఆఫ్ ఆడేన్‌కు బయలుదేరింది. దీనిని సముద్రపు దొంగలు శనివారం రాత్రి హైజాక్ చేశారు. ఈ విషయాన్ని ఈ నౌకను నిర్వహిస్తున్న బ్రిటన్ ఆ సమయంలో భారత్, చైనా, పాకిస్థాన్, ఇరాన్ దేశాలకు కబురందించగా భారత్ వేగంగా స్పందించింది. ముందుగా నేవీ హెలికాప్టర్‌ను పంపించి ఆ నౌకపైనే రక్షణగా చక్కర్లు కొట్టింది. ఆ తర్వాతే చైనాకు చెందిన 18మంది నేవీ ఆర్మీ ఆ షిప్‌లోకి అడుగుపెట్టారు. అనంతరం భారత్‌కు చెందిన యుద్ధనౌకలు హైజాక్ గురయిన షిప్‌ను సమీపించగానే సముద్రపు దొంగలు పారిపోయారు. ఈ ఆపరేషన్ సంయుక్తంగా నిర్వహించినప్పటికీ తప్పుడు ప్రకటన చేసి చైనానే ఈ ఘనత చేసినట్లు ప్రకటించేసుకుంది.
మరిన్ని సంబంధిత వార్తా కథనాలకై చదవండి


