భారత్‌కు థ్యాంక్స్‌ చెప్పిన చైనా | Sakshi
Sakshi News home page

భారత్‌కు థ్యాంక్స్‌ చెప్పిన చైనా

Published Sun, Apr 9 2017 1:30 PM

భారత్‌కు థ్యాంక్స్‌ చెప్పిన చైనా - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌, భారత్‌ మధ్య ఎంత వైరం ఉంటుందో దాదాపు చైనాకు భారత్‌కు మధ్య కూడా అంతే ఉంటుంది. అయితే, అది మాత్రం పైకి కనిపించదు. సైనికపరమైన పోటీ కూడా భారత్‌, చైనా మధ్య ఎప్పుడూ ఉంటుంది. అలాంటి, భారత్‌, చైనాలు ఓ నౌకను కాపాడేందుకు కలిసి ముందుకుసాగాయి. బ్రిటన్‌కు చెందిన ఓ గూడ్స్‌ నౌకపై సముద్రపు దొంగలు దాడి చేయగా దాని నుంచి రక్షించాయి. చైనా నావికా దళం సమీపంలోనే ఈ దాడి జరిగినా ఆ దేశం కంటే ముందు భారత్‌ స్పందించి సహాయం చేసినందుకు చైనా ధన్యవాదాలు తెలిపింది.

ఇరు దేశాల మధ్య సముద్ర జలాల్లో పరస్పర సంరక్షణ, సమన్వయం ఇలాగే ఎప్పటికీ ఉండాలని పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన మారిటైం ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌(యూకేఎంటీవో) తువాలుకు చెందిన ఎంవీఓఎస్‌ 35 అనే 21,000 టన్నుల నౌకను పర్యవేక్షిస్తోంది. ఇది మలేషియాలోని కెలాంగ్‌ నుంచి పోర్ట్‌ ఆఫ్‌ ఏడేన్‌కు వెళుతోంది. ఆ సమయంలో ఈ నౌకపై సముద్రపు దొంగల దాడి జరిగినట్లు యూకేఎంటీంవో నుంచి భారత్‌కు చెందిన యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్‌ ముంబయి, ఐఎన్‌ఎస్‌ తర్కాష్‌లకు అప్రమత్తతో కూడిన సమాచారం వచ్చింది. అదే సముద్రంలో చైనా, ఇటాలియన్‌, పాకిస్తాన్‌కు చెందిన నౌకా దళాలు కూడా ఉన్నాయి.

వారికి కూడా సముద్రపు దొంగల అలర్ట్‌ వెళ్లింది. అయితే, వాటికంటే ముందు స్పందించిన భారత నేవీ వెంటనే ఒక హెలికాప్టర్‌ నుంచి పంపించి రాత్రికి రాత్రే రక్షణగా నిలిచింది. అప్పటికే ఆ నౌకలోని కెప్టెన్‌, ఇతర సిబ్బంది తమ ప్రాణాలు రక్షించుకునేందుకు లోపలికి వెళ్లి తాళం వేసుకున్నారు. అయినప్పటికీ ఆ షిప్‌ కెప్టెన్‌తో సంప్రదింపులు జరిపి వారికేం భయం లేదని హామీ ఇచ్చింది. ఈ లోగా చైనాకు చెందిన 18మంది నౌకా దళ సైనికులు కూడా అక్కడి చేరుకొని ఆ నౌకకు రక్షణ కల్పించారు. అయితే, భారత్‌ ఆర్మీ హెలికాప్టర్‌ను పంపించిన వెంటనే అక్కడి సముద్రపు దొంగలు పారిపోయినట్లు తెలుస్తోంది. శీఘ్రంగా స్పందించిన భారత్‌కు ఈ సందర్భంగా చైనా కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement
Advertisement