‘పీఓకే నుంచి పాక్ వైదొలగాలి’

లండన్ : జమ్ము కశ్మీర్ విషయంలో ఓ బ్రిటిష్ ఎంపీ భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. పాకిస్తాన్ తీరును ఎండగడుతూ తొలుత పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి ఆ దేశం వైదొలగాలని డిమాండ్ చేశారు. జమ్ము కశ్మీర్ భారత్ అంతర్భాగమని బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ స్పష్టం చేశారు. ఐరాస తీర్మానాన్ని అమలు చేయాలని కోరే వారు ముందు కశ్మీర్ రాష్ట్రాన్ని తిరిగి ఏకీకృతం చేసేందుకు కశ్మీర్ నుంచి పాక్ సేనలు వైదొలగాలన్న తొలి తీర్మానాన్ని విస్మరించారని పాక్ తీరును ఆయన తప్పుపట్టారు. జమ్ము కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్ధానంలో ప్రస్తావిస్తామని, ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తామని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి పేర్కొన్న నేపథ్యంలో బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు జమ్ము కశ్మీర్ వ్యవహారాన్ని తాను ఐక్యరాజ్యసమితి సాధారణ సమితి సమావేశాల్లోనూ ప్రస్తావిస్తానని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి