ఈ డ్రగ్‌ మాఫియా డాన్‌ రూటే సపరేటు..!

Brazilian Gang Leader Dressed as Daughter in Wonky Prison Break Attempt - Sakshi

రియోడిజెనిరో : పోలీసుల కళ్లుగప్పి జైలు నుంచి తప్పించుకోవడంలో క్రిమినల్స్‌ వేసే ఎత్తులు చూస్తుంటే ఒక్కోసారి ఔరా అనిపిస్తుంది. హాలీవుడ్‌ సినిమా వాళ్లకు కూడా రాని కళాత్మకతను వీరు తమ ‘కళ’ల్లో చూపిస్తుంటారు. విషయం ఏంటంటే.. డాన్‌లలో డ్రగ్‌ మాఫియా డాన్‌ల రూటే సపరేటంటూ బ్రెజిల్‌లోని జైలులో ఉన్న ఓ డ్రగ్‌ మాఫియాడాన్‌కు ఓ ఐడియా వచ్చింది. అచ్చం తన టీనేజర్‌ కూతురులా రెడీ అయి జైలు నుంచి తప్పించుకోవాలనేది అతని ప్లాన్‌. కానీ చివరి నిమిషంలో అమ్మాయిలా నటించడంలో మాత్రం సక్సెస్‌ కాలేక ‘సిగ్గు’లో కాలేసి అడ్డంగా బుక్కయ్యాడు. 

42 సంవత్సరాల క్లౌవినో డ సిల్వా బ్రెజిల్‌ దేశంలో పేరుమోసిన డ్రగ్‌ మాఫియాకు నాయకుడు. ఇతడు ప్రస్తుతం రియోడిజెనిరో నగరంలోని సెంట్రల్‌ జైలులో 73 సంవత్సరాల కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే రకరకాల ఎత్తులు వేసినా పారలేదు. దీంతో ఏకంగా తన కూతురుని ఉపయోగించుకొని పారిపోవాలని భారీ స్కెచ్‌ వేశాడు. తనను కలవడానికి వచ్చిన 19 ఏళ్ల కూతురిని లోపలే ఉంచి అప్పటికే సిద్ధం చేసుకున్న టీషర్ట్‌, సిలికాన్‌మాస్క్‌, కళ్లజోడు, విగ్‌లతో అచ్చం కూతురిలా రెడీ అయి బయటకు వచ్చాడు. పాపం జైలు ఆవరణలోని పోలీసులు కూడా ఇతన్ని చూసి అమ్మాయే అనుకొని పొరపాటుపడ్డారు. దీంతో గేటు వరకూ వచ్చాడు. దాదాపు బయటకు వెళ్లే సమయంలో గేటు దగ్గర చివరి తనిఖీల్లో భాగంగా పోలీసులు చెక్‌ చేస్తుండగా మనోడు అమ్మాయిలా మరీ మెలికలు తిరిగిపోయాడంటా. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి అవాక్కయ్యారు. అతడి ఒక్కొక్క మేకప్‌ తీయమని చెప్తూ వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మేకప్‌ తీసేస్తున్నప్పుడు మనోడి కాన్ఫిడెన్స్‌ చూస్తే దిమ్మతిరగాల్సిందే. ఇంతకీ ఇన్ని వస్తువులు ఎలా వచ్చాయబ్బా అని ఆరా తీయగా గర్భిణి వేషంలో అంతకుముందే ఓ మహిళ ఇతడిని కలిసి వెళ్లిందని తెలిసింది. మధ్యలో ఈ పాడు సిగ్గు అడ్డురాకుండా ఈ కొ(చె)త్త ఐడియా సక్సెస్‌ అయి ఉంటే ఇప్పుడు ట్విటర్‌లో ఎగిరే బదులు హాయిగా ఏ డాన్‌ సెట్‌లోనో కూర్చునేవాడేమో!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top