స్మారక భవనంగా అంబేడ్కర్‌ లండన్‌ నివాస గృహం

Ambedkar Residence as a memorial building - Sakshi

లండన్‌ మహానగరం చారిత్రక అంశాల్లో బీఆర్‌ అంబేడ్కర్‌కు కూడా చోటు లభించనుంది. వందేళ్ల కింద ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లిన అంబేడ్కర్‌ అక్కడి కింగ్‌హెన్రీ రోడ్‌లోని ప్రైంరోజ్‌ హిల్, నంబర్‌ 10 ఇంట్లో నివసించారు. దీన్ని స్మారక భవనంగా మార్చేందుకు తాజాగా బ్రిటిష్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. నాలుగంతస్తుల ఈ భవనాన్ని ఏప్రిల్‌ 19 నుంచి సందర్శకుల కోసం తెరిచి ఉంచినా.. త్వరలో లాంఛనంగా ప్రారంభించనుంది.

ఈ భవనం కింది అంతస్తులో సమావేశ మందిరాన్ని, ఒకటి, రెండో అంతస్తుల్లో ఫొటో గ్యాలరీని, పై అంతస్తులో అంబేడ్కర్‌ సాహిత్యాన్నీ ఉంచారు. తొలి అంతస్తులో అంబేడ్కర్‌ విగ్రహానికి ఎదురుగా రీడింగ్‌ రూం ఏర్పాటు చేశారు. మూడేళ్ల కింద మహారాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాన్ని కొనుగోలు చేసినా.. నిర్వహణ బాధ్యతలను బ్రిటిష్‌ ప్రభుత్వమే చేసుకుంటూ ఉండటం విశేషం.

మేడమ్‌ ఎఫ్‌ ఇల్లు అది!
కింగ్‌ హెన్రీ రోడ్‌లోని పదో నంబర్‌ ఇంటి యజమాని కుమార్తె పేరు ఫాన్నీ ఫిట్జెరాల్డ్‌. ఆమె తల్లి ఫాన్నీ ఫిట్జెరాల్డ్‌ను ముద్దుగా ‘ఎఫ్‌’ అని పిలుచుకునేవారు. 1920–23 మధ్య అంబేడ్కర్‌ లండన్‌లోని మేడం ఎఫ్‌ ఇంట్లో నివాసం ఉన్నారు. అణగారిన వర్గాల కోసం పోరాడుతున్న అంబేడ్కర్‌ భావజాలం, ఆయా వర్గాల పట్ల అతడి నిబద్ధత మేడం ఎఫ్‌ను కాలేజీ రోజుల్లోనే అమితంగా ప్రభా వితం చేశాయి.

అణగారిన వర్గాల విముక్తి కోసం అహరహం పాటుపడిన పోరాట యోధుడిగా అంబేడ్కర్‌ ఆమె మనసులో బలమైన ముద్రవేశారని అంబేడ్కర్‌ సెక్రటరీగా పనిచేసిన నానక్‌ చంద్‌ రట్టూ తాను రాసిన ‘లిటిల్‌ నోన్‌ ఫాసెట్స్‌ ఆఫ్‌ డాక్టర్‌ అంబేడ్కర్‌’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో చదువు కొనసాగిస్తున్నప్పుడు అంబేడ్కర్‌కి పరిశోధనలోనూ, రాతకి సంబంధించిన విషయాల్లోనూ మేడం ఎఫ్‌ సాయపడేవారు.

ఆయన రీసెర్చ్‌కు సంబంధించిన గుట్టలకొద్దీ మెటీరియల్‌ని టైప్‌ చేసి ఇచ్చేవారట కూడా. లండన్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఉద్యోగిగా ఉన్నా.. ఖాళీ సమయంలో అంబేడ్కర్‌ రచనల్లోనూ, ఇతర కార్యక్రమాల్లోనూ సంపూర్ణ సహకారం అం దించేవారట. ఇప్పడు మేడం ఎఫ్‌ ఇంటిని మ్యూజియంగా మార్చి బ్రిటిష్‌ ప్రభుత్వం భారత ప్రజల ప్రియతమ నాయకుడికి మరింత గౌరవం తెచ్చిపెట్టింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top