జలాలుద్దీన్‌ హక్కానీ మృతి

Afghan Taliban announces death of Jalaluddin Haqqani - Sakshi

కొన్నేళ్లుగా అనారోగ్యంతో..

ప్రస్తుతం కొడుకు సిరాజుద్దీన్‌ నేతృత్వంలో కార్యకలాపాలు

కాబుల్‌: ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్‌ హక్కానీ అనారోగ్యంతో మృతిచెందినట్లు అఫ్గానిస్తాన్‌ తాలిబన్‌ మంగళవారం ప్రకటించింది. అఫ్గానిస్తాన్, అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలతో పోరాడుతున్న హక్కానీ నెట్‌వర్క్‌ తాలిబన్‌కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. జలాలుద్దీన్‌ అనారోగ్యం కారణంగా కొన్నేళ్లుగా ఆయన కొడుకు సిరాజుద్దీన్‌ హక్కానీకి నాయకత్వం వహిస్తున్నాడు. 2001లో అఫ్గానిస్తాన్‌పై అమెరికా దురాక్రమణ తర్వాతి దాడుల్లో హక్కానీ పాత్ర ఉంది.

భారీ ఆత్మాహుతి దాడులకు పాల్పడతారని హక్కానీలకు పేరుంది. ఇటీవల కాబుల్‌లో ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల వెనక ఈ బృందాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అమెరికా ఉన్నతాధికారుల హత్య, విదేశీయల కిడ్నాప్‌లలోనూ హక్కానీ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. గ్వాంటానామో జైలు నుంచి ఐదుగురు అఫ్గాన్‌ ఖైదీలను అమెరికా విడుదలచేశాకే 2014లో తమ చెర నుంచి అమెరికా సైనికుడిని వదిలిపెట్టారు. అఫ్గాన్‌లో ఉగ్ర ఏరివేతలో నిమగ్నమైన అమెరికా ప్రాధాన్యతా జాబితాలో హక్కానీ ఉంది. పాక్‌ నిఘా సంస్థకు హక్కానీ నమ్మకమైన నేస్తం అని అమెరికా అడ్మిరల్‌ మైక్‌ ముల్లెన్‌ గతంలో ఆరోపించారు.

మిత్రుడు శత్రువుగా..
అమెరికా ఆర్థిక అండతో కీలక నేతగా ఎదిగిన జలాలుద్దీన్‌ సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. సోవియెట్‌ ఆక్రమించుకున్న అఫ్గాన్‌ భూభాగాన్ని విముక్తం చేశాడు. తర్వాత లాడెన్‌కు మద్దతిచ్చి అమెరికాకు  కోపంతెప్పించాడు. 1979–89 మధ్య కాలంలో జరిగిన సోవియట్‌–అఫ్గాన్‌ యుద్ధంలో హక్కానీ ముజాహిదీన్‌ల తరపున పోరాటం చేశాడు. అమెరికా(సీఐఏ), గల్ఫ్‌ దేశాలు ముజాహిదీన్‌లకు అవసరమైన ఆర్థిక సహాయ, సహకారాలు అందించాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు రీగన్స్‌ ఆహ్వానించడంతో హక్కానీ వైట్‌హౌస్‌కు వచ్చాడని నాడు పత్రికల్లో కథనాలొచ్చాయి.

సోవియట్‌తో యుద్ధం ముగిశాక ఒసామాబిన్‌ లాడెన్‌ సహా ఇతర అరబ్‌ ఉగ్రవాద సంస్థలతో హక్కానీ సన్నిహిత  సంబంధాలను కొనసాగించాడు. 1992లో కాబుల్‌ను ముజాహిదీన్‌లు ఆక్రమించిన అనంతరం ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వంలో హక్కానీ గిరిజన శాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తించాడు. తాలిబన్ల మిలటరీ కమాండర్‌గానూ వ్యవహరించాడు. అమెరికా సేనల నుంచి లాడెన్‌ తప్పించుకునేందుకు సాయం చేశాడు.

తాలిబన్లతో సంబంధాలు తెంచుకోవాలని అమెరికా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించాడు. ఆ తరువాత కాలంలో అమెరికాకే కొరుకుడు పడని ఉగ్రవాదిగా మారాడు. 2011 నాటికి హక్కానీ నెట్‌వర్క్‌లో 15 వేల మంది కమాండర్లు పనిచేస్తున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. తమ భూభాగంలో ఉగ్ర ఆవాసాలను సమూలంగా మట్టుపెట్టామని పాకిస్తాన్‌ ప్రకటించినా, హక్కానీ నెట్‌వర్క్‌ చెక్కుచెదరలేదని అఫ్గాన్‌ అధికారులు ప్రకటించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top