జీహెచ్‌ఎంసీకి కొత్తనీరు! | Will soon replace many vacancies | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీకి కొత్తనీరు!

Aug 21 2015 12:27 AM | Updated on Sep 3 2017 7:48 AM

రానున్న రోజుల్లో జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లోకి కొత్త ఉద్యోగులు రానున్నారు. వేల రూ. కోట్ల నిధులున్నా, చేయాల్సిన .....

త్వరలో పలు ఖాళీల భర్తీ
 
సిటీబ్యూరో రానున్న రోజుల్లో జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లోకి కొత్త ఉద్యోగులు రానున్నారు. వేల రూ. కోట్ల నిధులున్నా, చేయాల్సిన పనులెన్నో ఉన్నా వాటిని పర్యవేక్షించేందుకు, నిర్వహించేందుకు తగినంతమంది అధికారులు, ఉద్యోగులు లేరు. దాంతో  జీహెచ్‌ఎంసీలో పలు పనులు ఎక్కడివక్కడే కుంటుతున్నాయి.

ఈ పరిస్థితి త్వరలో మారనుంది. తెలంగాణ ప్రభుత్వ తొలి ఉద్యోగ ప్రకటన వెలువడటంతో ఇక దశలవారీగా జీహెచ్‌ఎంసీలో పోస్టులు భర్తీ అవుతాయని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వివిధ విభాగాల నుంచి అధికారులను డిప్యుటేషన్ మీద తీసుకుంటుంది. అలా వివిధ విభాగాల్లో వెరసి 843 డిప్యుటేషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో 300కు పైగా  ఇంజినీర్ల పోస్టులు కూడా ఉన్నాయి.  తొలివిడత భర్తీ కానున్న ఇంజినీర్ల పోస్టుల్లో దాదాపు వందమంది జీహెచ్‌ఎంసీకి వచ్చే వీలుందని చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లో ఆయా బాధ్యతలు నిర్వహించేందుకు పబ్లిక్‌హెల్త్, డీటీసీపీ, టీఎస్‌పీడీసీఎల్, డెరైక్టరేట్ ఆఫ్ హెల్త్, హార్టికల్చర్, పోలీస్, పశుసంవర్థకశాఖ, ఆడిట్, అగ్నిమాపక శాఖ, సమాచార, పౌరసంబంధాల శాఖ, న్యాయవిభాగం, గణాంక.. తదితర  విభాగాల నుంచి డిప్యుటేషన్ మీద తీసుకుంటారు. ఆయా ప్రభుత్వ విభాగాల్లో త్వరలో భర్తీ కానున్న పోస్టుల్లో నియమితులయ్యేవారు గణనీయసంఖ్యలో జీహెచ్‌ఎంసీకి వచ్చే అవకాశాలున్నాయి.

జీహెచ్‌ఎంసీ అవసరాల దృష్ట్యా 2607 పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉందని ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నప్పుడే ప్రసాదరావు కమిటీ సిఫార్సు చేసింది. అందులో 1300 పోస్టుల్ని తొలిదశలో భర్తీచేసేందుకు అప్పటి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటు.. తదితర పరిణామాల నేపథ్యంలో అవి భర్తీ కాకుండా పెండింగ్‌లో పడ్డాయి. ఇదిలా ఉండగా, గ్రేటర్‌లో  పెద్దఎత్తున చేపట్టనున్న గృహనిర్మాణ కార్యక్రమానికి ఇంజినీరింగ్ విభాగానికి  390 మంది టెక్నికల్ అధికారులు అవసరమని కోరారు. తొలి నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్న ఇంజినీర్లలో దాదాపు వందమంది జీహెచ్‌ఎంసీకి వచ్చే వీలుందని చెబుతున్నారు.

 బీపీఎస్ అమలుకు 50 మంది టౌన్‌ప్లానింగ్ అధికారులు..
 భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం లేకుండా ఉండేందుకు..త్వరలోనే అమల్లోకి రానున్న బీపీఎస్‌ను అమలు చేసేందుకు కనీసం 50 మంది టౌన్‌ప్లానింగ్ అధికారులు కూడా కావాలని కోరారు.స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం అమలు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి 18 మంది అధికారులను జీహెచ్‌ఎంసీకి పంపించాలని కోరారు. ఇలా వివిధ విభాగాలు, అంశాల వారీగా దాదాపు  1500 మంది అధికారులను ప్రథమప్రాధాన్యతగా భర్తీ చేయాల్సిన అవసరముందని జీహెచ్‌ంఎసీ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement