నోట్ల రద్దు నష్టం రూ.1.28 లక్షల కోట్లు

నోట్ల రద్దు నష్టం రూ.1.28 లక్షల కోట్లు - Sakshi


కేంద్ర ప్రభుత్వంపై ఉత్తమ్‌ ధ్వజం

►  మోదీ సర్కారు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని మండిపాటు

ఆర్బీఐ కార్యాలయం ఎదుట  టీ పీసీసీ ధర్నా


సాక్షి, హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం అపార నష్టం కలిగించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు అనిల్‌ శాస్త్రి మండిపడ్డారు. మోదీ సర్కారు అనాలోచిత, మూర్ఖపు, పిచ్చి తుగ్లక్‌ నిర్ణయం వల్ల అన్ని రంగాలకు దాదాపు రూ. 1.28 లక్షల కోట్ల నష్టం కలిగిందన్నారు. నోట్ల రద్దును నిరసిస్తూ హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రాంతీయ కార్యాలయం ఎదుట టీ పీసీసీ శుక్రవారం ధర్నా నిర్వహించింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్ష నేతలు కె. జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు కాంగ్రెస్‌ సీనియర్లంతా ధర్నాలో పాల్గొన్నారు.


ఉత్తమ్‌ మాట్లాడుతూ మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పేదలపై సర్జికల్‌ స్ట్రైక్‌ అన్నారు. దేశంలో 86 శాతం చెలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రధాని తన నిర్ణయంతో ఆర్‌బీఐపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని కూడా దెబ్బ తీశారని విమర్శించారు. ఈ నిర్ణయం తర్వాత 138 సార్లు నగదు డిపాజిట్లు, ఉపసంహరణల నిబంధనలను మార్చారన్నారు. నగదు కోసం బ్యాంకుల వద్ద కూలైన్లలో నిలబడి దాదాపు 120 మంది ప్రాణాలను పోగొట్టుకున్నారని, ఇందుకు బాధ్యత వహించి ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయాలని ఉత్తమ్‌ డిమాండ్‌  చేశారు.మాట మార్చిన మోదీ...

పెద్ద నోట్ల రద్దు జాతీయ స్థూల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందని, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నదని, రబీలో సాగు విస్తీర్ణం చాలా వరకు పడిపోయిందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. నోట్ల రద్దుతో నల్లధనం బయటకు రాకపోగా, నిజాయితీపరులే నగదు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో నల్లధనం బయటకు రాకపోవడంతో ప్రధాని మోదీ నగదు రహిత, డిజిటల్‌ లావాదేవీలంటూ కొత్తరాగం అందు కున్నారని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయంలో నోట్ల మార్పిడి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రజలు నోట్లను మార్చుకోవాలనుకుంటే నాగపూర్, చెన్నై ఆర్‌బీఐ కార్యాలయాలకు వెళ్లాలని బ్యాంకులు చెబుతున్నా యని...దీనిపై సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.


నోట్ల రద్దును తొలుత దిక్కుమాలిన నిర్ణయంగా అభివర్ణించిన సీఎం కేసీఆర్‌ ఆ తర్వాత మాటమా ర్చడంలో మతలబు ఏమిటో చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. ధర్నాలో ఏఐసీసీ కార్యదర్శులు ఆర్‌.సి.కుంతియా, జి.చిన్నారెడ్డి, వి.హన్మంతరావు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, డి.కె.అరుణ, సునీతా లక్ష్మా రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, రంగారెడ్డి, నేతలు నేరెళ్ల శారద, అంజన్ కుమార్‌ యాదవ్, దాసోజు శ్రవణ్, బండ కార్తీకరెడ్డి పాల్గొన్నారు.నష్టపోతున్నామంటూ కేంద్రానికి మద్దతేల?

పెద్ద నోట్ల రద్దు వల్ల రుణమాఫీ చేయలేకపోతున్నా మని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయలేకపోతున్నా మని, ఆదాయం పడిపోయిందని చెబుతున్న కేసీఆర్‌... మోదీ ప్రభుత్వానికి ఎందుకు మద్దతిస్తున్నారని ఉత్తమ్, నోట్ల రద్దు వ్యతిరేక ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్  పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దును దిక్కుమాలిన నిర్ణయమంటూ అసహనం ప్రదర్శించిన కేసీఆర్‌... ఉన్నఫళంగా వైఖరిని ఎందుకు మార్చుకున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు.


శుక్రవారం గాంధీ భవన్ లో వారు విలేకరులతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... కేంద్రానికి మద్దతు ఇవ్వడంలో అసలు రహస్యం ఏమిటో ప్రజలే చర్చించుకుంటున్నారని చెప్పారు.  పేద మహిళల ఖాతాల్లో రూ. 25 వేలు డిపాజిట్‌ చేయాలి: అనిల్‌శాస్త్రి

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు అనిల్‌ శాస్త్రి మాట్లాడుతూ విదేశీ కంపెనీలకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికి, దేశంలోని బడా కంపెనీలను బాగుచేయడానికే మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. నోట్ల రద్దుతో నష్టపోయిన ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.  ప్రజలు బ్యాంకులో వేసుకున్న నగదును ఉపసంహరించుకోవడానికి పరిమితు లను తొలగించాలని డిమాండ్‌ చేశారు. పేద మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 25 వేల చొప్పున జమ చేయాలని కోరారు. అలాగే ఉపాధి హామీ చట్టం కూలీ రేట్లు పెంచాలని, పని దినాలను రెట్టింపు చేయాలని, చిరు వ్యాపారులకు పన్ను మినహాయింపునివ్వాలని డిమాండ్‌ చేశారు.27న జన ఆవేదన సమ్మేళనం

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను కేంద్రానికి తెలియ జేప్పేందుకు ఈ నెల 27న సికింద్రాబాద్‌లో భారీగా జన ఆవేదన సమ్మేళనాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. నోట్ల రద్దుపై టీపీసీసీ ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్  పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన శుక్రవారం గాంధీ భవన్ లో సమావేశమైంది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సహా ముఖ్య నేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top