ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని దర్యాప్తు | Two years for Cash-for-vote issue | Sakshi
Sakshi News home page

ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని దర్యాప్తు

May 30 2017 11:32 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని దర్యాప్తు - Sakshi

ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని దర్యాప్తు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన బృందం

‘ఓటుకు కోట్లు’కు రెండేళ్లు
- టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు రూ.కోట్ల ముడుపులు
- డబ్బు ఇవ్వజూపుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్‌
- ‘మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ’ అంటూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు
- బాబే సూత్రధారి అనేందుకు స్పష్టమైన ఆధారాలున్నా ఏసీబీ మౌనం
కేసు ఫైళ్లు దుమ్ము పట్టిపోతున్నాయన్న ఏసీబీ అధికారులు  
 
సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన బృందం పన్నిన ‘ఓటుకు కోట్లు’ కుట్రకు రెండేళ్లు కావొస్తోంది. 2015, మే 31న టీడీపీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ముడుపులతో ప్రలోభపెడుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాం డెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబునాయుడు నేరుగా ‘మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ..’ అంటూ ఫోన్‌లో మాట్లాడిన ఆడియో టేపులూ బహిర్గతమయ్యాయి. కానీ కేసు దర్యాప్తు ప్రారంభమై రెండేళ్లవుతున్నా పరిస్థితి ఎక్కడికక్కడే ఉంది. ఈ వ్యవహారంలో సూత్రధారి అయిన చంద్రబాబుపై ఏసీబీ ఎలాంటి చర్యలూ చేపట్టలేకపోయింది. దీంతో ‘ఓటుకు కోట్లు’ కేసు సంగతి ఇక ముగిసినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఇప్పుడంతా మౌనమే!
కేసు ప్రారంభ దశలో చంద్రబాబును త్వరలోనే విచారిస్తామని పదే పదే చెప్పిన ఏసీబీ.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయింది. ఆడియోలో ఉన్న గొంతు చంద్రబాబుదే అని నిర్ధారణ అయినా కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. దీంతో ఈ కేసు రాజకీయంగా పక్కదారి పట్టిందని ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ మాత్రం స్పందించడం లేదు. ఈ కేసులో ఏ1గా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ్‌ సింహా, మత్తయ్య తదితరుల పాత్రపై ఏసీబీ రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. వాటిలో తెర మీద కనిపిస్తున్న నిందితుల వివరాలను పేర్కొంటూనే.. తెరవెనుక సూత్రధారిగా ఉన్న చంద్రబాబు పేరును పరోక్షంగా చాలా సార్లు పేర్కొంది. ఆ తర్వాత ఎలాంటి చర్యలూ లేవు.
 
దర్యాప్తు పూర్తయ్యేదెన్నడు?
‘ఓటుకు కోట్లు’ వ్యవహారంపై ఎన్నికల సంఘం అప్పట్లోనే స్పందించింది. అప్పటి ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌కు లేఖ రాసింది. దోషులు ఏ స్థాయి వారైనా సరే.. కేసుకు లాజికల్‌ ఎండ్‌ ఇచ్చి నివేదిక పంపాలని ఆదేశించింది. అయినా ఏమాత్రం ముందడుగు పడ లేదు. అసలు ఎన్నికల కమిషన్‌ రాసిన లేఖ ఇప్పుడు ఎక్కడుందో తెలియని దుస్థితి ఉంది. మరోవైపు చంద్రబాబు పేరును చార్జిషీటులో 40 సార్లకుపైగా ప్రస్తావిం చిన ఏసీబీ, ఆమేరకు చర్యలు చేపట్టకపోవడంపై గవర్నర్‌ నరసింహన్‌ దృష్టిసారించినట్లు తెలిసింది. ఏకే ఖాన్‌ తర్వాత ఏసీబీ డీజీగా వచ్చిన చారుసిన్హా ఈ కేసులో అసలు విషయాలను, చంద్రబాబు పాత్రను ఆధారాలతో సహా రెండో చార్జిషీట్‌ను సిద్ధం చేశారు. కానీ పై నుంచి వచ్చిన ఒత్తిళ్లతో మార్పులు చేసి చంద్రబాబు పేరు నిందితుల జాబితాలోకి రాకుండా చార్జిషీట్‌ దాఖలు చేసినట్టు ఆరోపణలున్నాయి. అందువల్లే గవర్నర్‌ నరసింహన్‌ ఏసీబీ డైరెక్టర్‌ నుంచి చార్జిషీట్‌ కాపీలు తెప్పించుకుని, ఢిల్లీ పెద్దలకు అందజేసినట్లు వార్తలు వచ్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement