యాదమ్మను కొట్టి చంపేశారు | toddler lasya killing suspect dies in hospital | Sakshi
Sakshi News home page

యాదమ్మను కొట్టి చంపేశారు

Oct 24 2015 3:23 PM | Updated on Apr 3 2019 8:07 PM

యాదమ్మను కొట్టి చంపేశారు - Sakshi

యాదమ్మను కొట్టి చంపేశారు

చిన్నారి లాస్య హత్యకేసులో నిందితురాలు యాదమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది.

హైదరాబాద్: చిన్నారి లాస్య హత్యకేసులో నిందితురాలు యాదమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. లాస్య హత్య జరిగిన అనంతరం మృతదేహం యదమ్మ ఇంట్లో బయట పడటంతో ఆమెను స్థానికులు చావబాదిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి  గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాదమ్మ శనివారం మరణించింది.

వివరాలు.. ఫతేనగర్ దీన్‌దయాళ్‌నగర్‌కు చెందిన నవీన్, మయూరి దంపతులకు లాస్య అలియాస్ పండు (4) సంతానం.  నవీన్ ఇంటికి ఒక పక్క లక్ష్మయ్య, యాదమ్మ దంపతులు.. కుమార్తె పద్మ (35), కుమారుడు నర్సింహులుతో కలిసి ఉంటున్నారు.

నవీన్ ఇంటికి మరోపక్క గిరి (40) ఇల్లు ఉంది. లక్ష్మయ్య కూతురు పద్మతో గిరికి వివాహేతర సంబంధం ఉంది. ఇదిలా ఉండగా.. ఇల్లు నిర్మిస్తున్న సమయంలో ప్రహరీ విషయంలో లక్ష్మయ్య కుటుంబానికి, నవీన్‌కు మధ్య వివాదం తలెత్తింది. నవీన్ ఇదే సమయంలో గిరి, పద్మల వివాహేతర సంబంధాన్ని లేవనెత్తి దెప్పేవాడు. నవీన్ ద్వారా స్థానికులందరికీ వివాహేతర సంబంధం విషయం తెలిసిందని, నవీన్ కుటుంబంపై లక్ష్మయ్య కుటుంబం కక్షగట్టి పగ తీర్చుకొనేందుకు వేచి చూస్తోంది.  
 
అతి క్రూరంగా...
ఈనెల 14న రాత్రి 8 గంటలకు మున్సిపల్ సిబ్బంది వీరుండే వీధిలో దోమల మందు కొట్టారు. ఆ సమయంలో లాస్య రోడ్డుపై ఆడుకుంటోంది. ఫాగింగ్ మిషన్ ద్వారా విడుదలైన దట్టమైన పొగ రోడ్డుపై వ్యాపించిన సమయంలో లక్ష్మయ్య, యాదమ్మ, నర్సింహులు, గిరి, పద్మ కలిసి లాస్యను తమ ఇంట్లోకి లాక్కెళ్లారు.

అరవకుండా పాప ముఖాన్ని దిండుతో అదిమిపెట్టి.. గొంతు నులిమి చంపేశారు. అంతటితో ఆగకుండా కత్తితో గొంతు కోశారు. మృతదేహాన్ని ఒక సంచిలో మూటగట్టి సజ్జపై పడేశారు. పాపను ముక్క ముక్కలు చేసి అవయవాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకెళ్లి పడేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే అప్పటికే తమ పాప కనిపించకుండాపోవడంతో నవీన్ దంపతులు లక్ష్మయ్య కుటుంబాన్ని  ఓ కంట కనిపెడుతున్నారు. దీనికి తోడు రోడ్డుపై జనం తిరుగుతూ ఉండటంతో పాప మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లడానికి వారికి వీలుకాలేదు. మూడు రోజుల పాటు ఇంట్లోనే మృతదేహం ఉండటంతో కుళ్లిపోయి దుర్వాసన రావడం మొదలైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వారు వచ్చే లోగానే విషయం ఆ నోటా ఈ నోటా పొక్కడంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకుని ఇంట్లో ఉన్న లక్ష్మయ్య, యాదమ్మలను చితకబాదారు. స్థానికుల దాడిలో గాయాలకు గురైన యాదమ్మ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement