గూడు లేని బడి! | Sakshi
Sakshi News home page

గూడు లేని బడి!

Published Sat, Apr 1 2017 3:48 AM

గూడు లేని బడి!

ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా తరగతి గదుల్లేక అవస్థలు

- 3 వేల ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతులకు ఒకే గది
- మరో 6 వేల స్కూళ్లలో 2 గదులతోనే సరి
- ఒక్క గదీ దిక్కులేని స్కూళ్లు 68
చెట్ల కిందే చదువులు.. వర్షమొస్తే సెలవులు
గోడలే బ్లాక్‌ బోర్డులు..


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవు. దాంతో వరండాలు, చెట్ల కిందే బోధించాల్సి వస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపా యాల కల్పనకు దాదాపు 20 ఏళ్లుగా ఎన్నో పథకాలను అమలుచేస్తున్నా ఈ పరిస్థితి ఉండడం ఆందోళనకరం. మౌలిక సదుపాయాల కోసం డిపెప్, సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ) వంటి పథకాల కింద వేల కోట్ల రూపాయలు వెచ్చించినా విద్యార్థులకు నీడ కల్పించలేకపోతున్నారు. అంతేకాదు ఏటా ఎస్‌ఎస్‌ఏ కింద రూ.2 వేల కోట్లు, ఆర్‌ఎంఎస్‌ఏ కింద రూ.500 కోట్లు వెచ్చిస్తున్నా అవసరమైన చోట తరగతి గదులను నిర్మించడం లేదు. దీంతో వర్షాకాలం మొదలైందంటే పాఠశాలలకు సెలవులు తప్పడం లేదు.

అవసరమైన చోట మాత్రం లేవు
రాష్ట్రంలో 18 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. 68 స్కూళ్లకు ఇప్పటికీ ఒక్క తరగతి గది కూడా లేకపోవడం గమనార్హం. వాస్తవానికి ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఐదు గదులు ఉండాలి. కానీ అలాంటివి కేవలం 2,207 మాత్రమే ఉన్నాయి. ఒక్క గది ఉన్న స్కూళ్లు 2,992 ఉండగా, 2 గదులున్న స్కూళ్లు 6,362, మూడు గదులున్నవి 2,918, నాలుగు గదులున్న స్కూళ్లు 1,937 ఉన్నాయి. ఇక అవసరమైన ఐదు గదుల కంటే ఎక్కువ సంఖ్యలో గదులున్న స్కూళ్లు 1,678 ఉండటం గమనార్హం.

ఉన్నత పాఠశాలల్లోనూ అంతే..
ప్రాథమిక పాఠశాలలే కాదు ఉన్నత పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అవసరం లేని చోట ఇష్టానుసారం తరగతి గదులను మంజూరు చేసిన అధికారులు... అవసరమున్న చోట మాత్రం అదనపు తరగతి గదులను నిర్మించలేదు. దాంతో తరగతి గదుల కొరత ఉన్న హైస్కూళ్లు వేలల్లో ఉన్నట్లు విద్యాశాఖ అంచనా. ఇందుకు ఉదాహరణ నల్లగొండ జిల్లా మునుగోడు ఉన్నత పాఠశాల. 50 ఏళ్ల కింద నిర్మించిన ఈ పాఠశాల ప్రస్తుతం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. అందులో 420 మంది విద్యార్థులు చదువుతున్నా 4 తరగతి గదులు మాత్రమే బాగున్నాయి. పది తరగతులకు కనీసంగా పది గదులు ఉండాల్సి ఉన్నా.. అదనపు గదుల నిర్మాణాన్ని పట్టించుకోవడమే లేదు.

నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వంటి ప్రముఖులు చదువుకున్న ఈ స్కూళ్లో ఉన్న నాలుగు గదుల్లో నాలుగు తరగతులు, ఆరుబయట ఐదు తెలుగు మీడియం, ఐదు ఇంగ్లిషు మీడియం తరగతుల బోధనను కొనసాగించాల్సి వస్తోంది. అదేకాదు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం జెడ్పీ ఉన్నత పాఠశాలదీ అదే పరిస్థి«తి. అక్కడ మొత్తం 545 మంది విద్యార్థులుండగా.. సరిపడ గదుల్లేవు. వాస్తవానికి 16 గదులున్నా.. 8 గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. మిగతా 8 గదులే విద్యా బోధనకు అనువుగా ఉండటంతో ఆరుబయట కూడా బోధన కొనసాగించాల్సి వస్తోంది.

భద్రాద్రిలో అధికం..
విద్యాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఒక్క తరగతి గదీ లేని ప్రాథమిక పాఠశాలలు 68 ఉండగా.. అందులో 13 స్కూళ్లు భద్రాద్రి జిల్లాలోనే ఉన్నాయి. మహబూబాబాద్‌లో 9 పాఠశాలలు, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లో 6 చొప్పున ఒక్క తరగతి గదీలేని స్కూళ్లున్నాయి. ఇక ఒక్క తరగతి గదితోనే కొనసాగుతున్న స్కూళ్లు అత్యధికంగా నల్లగొండలో 236 ఉండగా, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 196, మహబూబాబాద్‌ జిల్లాలో 180 స్కూళ్లు ఉన్నాయి. భద్రాద్రిలో 141, రంగారెడ్డిలో 137 స్కూళ్లు ఒక్క తరగతి గదితోనే కొనసాగు తున్నాయి. 2 గదులతో కొనసాగుతున్న పాఠశాలలు అత్య«ధికంగా నల్లగొండ జిల్లాలో 382 ఉండగా, భద్రాద్రిలో 371, మహబూబా బాద్‌లో 319, మహబూబ్‌నగర్‌లో 311, ఖమ్మంలో 306, జయ శంకర్‌ జిల్లాలో 270 పాఠశాలలు ఉన్నాయి.

ఇక మూడు గదులున్న పాఠశాలలు అత్యధికంగా నల్లగొండలో 223, సంగారెడ్డిలో 171, సూర్యాపేటలో 138, ఖమ్మంలో 134, భద్రాద్రిలో 131 స్కూళ్లున్నాయి. నాలుగు తరగతి గదులున్నవి అత్యధికంగా రంగారెడ్డిలో 121, సూర్యాపేటలో 109 స్కూళ్లు ఉన్నాయి. ఇక ఐదు తరగతి గదులున్న పాఠశాలలు అత్యధికంగా నిజమాబాద్‌లో 140 ఉండగా, సిద్దిపేటలో 123 ఉన్నాయి. ఐదు కంటే ఎక్కువ తరగతి గదులున్న స్కూళ్లు అత్య«ధికంగా హైదరాబాద్‌లో 153, సంగారెడ్డిలో 121, రంగారెడ్డిలో 111 ఉన్నాయి.

బాలికల విద్యకు నిధులు పెంచాలి
కేంద్రానికి కేబ్‌ సబ్‌కమిటీ సూచన
సాక్షి, హైదరాబాద్‌: దేశంలో విద్యను ముఖ్యంగా బాలికల విద్యను ప్రోత్సహించేం దుకు కేటాయింపులు పెంచాల్సిన అవసర ముందని కేబినెట్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ (కేబ్‌) సబ్‌ కమిటీ అభిప్రాయప డింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా ఈ సబ్‌ కమిటీ గువహటిలో రెండో సమావేశం శుక్రవారం జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ప్రాముఖ్యం గురించి ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తు తం కేజీబీవీలకు 8వ తరగతి వరకే కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోందని, వీటిని 12వ తరగతి వరకు విస్తరించి కేంద్రమే పూర్తిగా ఆర్థిక సాయం చేయాలని ప్రతిపాదించింది. బాలికల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో అధ్యయనం చేయాల్సిన అసవర ముందని అభిప్రాయపడింది.

పాఠశాలల్లో టాయిలెట్స్‌ లేకపోవడం వల్ల కూడా డ్రాపౌట్స్‌ పెరుగుతున్నాయని పేర్కొంది. బాలికలకు హెల్త్‌ చెకప్‌ చేయించి హెల్త్‌ కార్డులందించాలని, హెల్త్‌ కిట్లు ఇవ్వాలని సూచించింది. వచ్చే నెలలో ఢిల్లీలో బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతపై పనిచేస్తున్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాఠశాలల్లో బాలిక సంఖ్య తగ్గడానికి గల కారణాలు క్షేత్ర స్థాయిలో తెలుసుకునేందుకు సీనియర్‌ అధికారులతో ఓ కమిటీ నియమించాలని నిర్ణయించింది. సమావేశంలో అసోం మంత్రి హేమంత బిస్వా శర్మ, జార్ఖండ్‌ మంత్రి నీరా యాదవ్, సభ్య కార్యదర్శి కేంద్ర మానవ వనరుల శాఖ అదనపు కార్యదర్శి రీనారాయ్, తెలంగాణ విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, కేంద్ర పాఠశాల విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సావిత్రి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement