గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఓటింగ్ శాతం పెంచేందుకు జీహెచ్‌ఎంసీ వ్యూహం
గత ఎన్నికల కంటే మెరుగవ్వాలని ఆదేశాలు
చైతన్య, అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు
హైదరాబాద్
గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా ప్లాన్ రూపొందిస్తోంది. గత ఎన్నికల కంటే రెట్టింపు శాతం పోలింగ్ నమోదు చేయాలని టార్గెట్ విధించుకుంటోంది. 2009 ఎన్నికల్లో 43 శాతం, 2002లో మరీ తక్కువగా 28 శాతం మందే ఓటేశారు.
ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతాన్ని పెంచాలని భావిస్తున్నారు. విద్యావంతులు, సాఫ్ట్‌వేర్ వృత్తుల వారు ఓటింగ్‌లో పాల్గొనక పోవడం, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో సమాచారం లేకపోవడం, ఓటరు చైతన్య కార్యక్రమాలను విరివిగా నిర్వహించక పోవడం వల్లే ఓటింగ్ శాతం తగ్గుతోందని అధికారులు గుర్తించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలుతో పాటు ఎన్నికల వ్యయం, ఓటింగ్ శాతం పెంపొందించడంపై సోమవారం జీహెచ్‌ఎంసీ ఆఫీసులో రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఓటింగ్ శాతంపై ప్రధానంగా దృష్టిని సారించనున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని కార్యాచరణను రూపొందిస్తారు.
తొలిసారిగా స్వయం సహాయక మహిళలకు అవగాహన
జీహెచ్‌ఎంసీ పరిధిలోగల సుమారు 44,280 స్వయం సహాయక బృందాలలో దాదాపు 4 లక్షల 50 వేల మంది మహిళా సభ్యులున్నారు. ఓటింగ్ శాతం పెంపుతో నగర అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు పెంపు, పౌర సేవలు మరింత మెరుగు తదితర అంశాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని కమిషనర్ నిర్ణయించారు. సర్కిల్స్ వారిగా వెంటనే సమావేశాలు నిర్వహించి ఓటరు చైతన్య అవగాహన కార్యక్రమాలు నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని యూసీడీ విభాగం అదనపు కమిషనర్ భాస్కర్‌ను ఆదేశించారు. దీంతో పాటు అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్లు తమ పరిధిలోని అన్ని డిగ్రీ వృత్తి విద్యా కళాశాలలను సందర్శించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
స్వచ్ఛంద సంస్థల సహకారం
ఓటింగ్ శాతం పెంచేందుకు స్వచ్ఛంద సంస్ధలు, యువజన సంఘాల సహకారం తీసుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెండు విడతలుగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, హోర్డింగ్‌ల ద్వారా పెద్దఎత్తున ఓటరు చైతన్య కార్యక్రమాల ద్వారా గణనీయంగా ఓటింగ్ శాతాన్ని పెంపొందించడానికి చర్యలు చేపట్టారు.
తక్కువ ఓటింగ్ కేంద్రాలపై దృష్టి
గత జీహెచ్‌ఎంసీ, సాధారణ ఎన్నికల సందర్భంగా అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదయిన ప్రాంతాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ నిర్ణయించారు. ప్రధానంగా నగరంలో విద్యాధికులు, సంపన్న వర్గాలు అధికంగా ఉండే సెంట్రల్, వెస్ట్ జోన్‌లోనే పలు వార్డుల్లో అతి తక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రిటీల సహాయ సహకారాలు పొందాలని అధికారులకు సూచించారు.
100 శాతం ఓటర్లకు పోల్ చిట్టీలు
గ్రేటర్ పరిధిలోని ప్రతి ఓటరుకు కచ్చితంగా పోల్‌చిట్టీలు అందించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకుగాను పోల్‌చిట్టీలు, ముద్రణ బుధవారంలోగా పూర్తి చేసి వెంటనే ఇంటింటికీ పంపిణీ చేయాలని ఎన్నికల విభాగం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికీ పోల్ చిట్టీలు పంపిణీ చేయడం వల్ల... ఓటరు తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉంది, సీరియల్ నెంబర్ ఎంత తదితర వివరాలు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. దీని వల్ల సమయం వృథా కాకుండా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే, జీహెచ్‌ఎంసీ ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపర్చడంతో పాటు తొలిసారిగా ఓటరు స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.