తాత్కాలిక సచివాలయం ప్రారంభం | Start the interim secretariat | Sakshi
Sakshi News home page

తాత్కాలిక సచివాలయం ప్రారంభం

Jun 30 2016 2:10 AM | Updated on Sep 4 2017 3:43 AM

తాత్కాలిక సచివాలయం ప్రారంభం

తాత్కాలిక సచివాలయం ప్రారంభం

తాత్కాలిక సచివాలయం బుధవారం మధ్యాహ్నం 2.51 గంటలకు తుళ్లూరు మండలం వెలగపూడిలో ప్రారంభమైంది.

- మధ్యాహ్నం 2.51 గంటలకు ప్రారంభించిన మంత్రి అయ్యన్నపాత్రుడు
- ప్రత్యేక బస్సుల్లో సచివాలయానికి తరలివచ్చిన ఉద్యోగులు
- విజయవాడలో, వెలగపూడిలో ఘనస్వాగతం
 
 సాక్షి, అమరావతి/ తుళ్లూరు/ హైదరాబాద్: తాత్కాలిక సచివాలయం బుధవారం మధ్యాహ్నం 2.51 గంటలకు తుళ్లూరు మండలం వెలగపూడిలో ప్రారంభమైంది. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు ఐదవ బ్లాక్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్ టక్కర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.59 గంటలకు మహిళా స్త్రీ శిశుసంక్షేమశాఖ  మంత్రి కిమిడి మృణాళిని తాత్కాలిక సచివాలయంలోకి అడుగుపెట్టారు. ఇద్దరు మంత్రులు వారి చాంబర్లలో ప్రత్యేక పూజలు జరిపి పాలనాపరమైన పత్రాలపై తొలి సంతకాలు చేశారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాల ప్రారంభం వాయిదాపడింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర పాలన వ్యవహారాలకు కీలకమైన సచివాలయాన్ని అమరావతికి తరలించేందుకు వెలగపూడిలో సుమారు 45 ఎకరాల్లో రూ.600 కోట్లతో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆరు భవనాలకుగాను బుధవారం ఐదవ భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ని ప్రారంభించారు. ప్లైవుడ్‌తో ఏర్పాటు చేసిన గదుల్లో బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటియాజమాన్య, గృహనిర్మాణశాఖ కార్యాలయాలను  మంత్రులు లాంఛనంగా ప్రారంభించారు.

 15 వేలమందీ వస్తారు: అయ్యన్న
 ఏపీ సచివాలయంలోని మొత్తం 15వేల మంది ఉద్యోగులు త్వరలోనే అమరావతి వచ్చేస్తారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. తాత్కాలిక సచివాలయంలోని ఐదో నెంబరు బ్లాక్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఈ సందర్భంగా  నాలుగు శాఖలకు సంబంధించి 1500 మంది ఉద్యోగులు వచ్చారని, ఆరో తేదీలోపు ఐదువేల మంది  వస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్య, లేబర్ అండ్ ఎంప్లాయిస్, హౌసింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు తమ విధులు ప్రారంభించాయని చెప్పారు. సచివాలయం నుంచి విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే అన్ని శాఖలు సచివాలయానికి చేరుకుంటాయని ప్రధాన కార్యదర్శి టక్కర్ వివరించారు. 

కార్యక్రమంలో హోం శాఖ మంత్రి చినరాజప్ప , మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, మృణాళిని, రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌లు పాల్గొన్నారు. మరోవైపు బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి  నాలుగు ప్రత్యేక బస్సుల్లో వైద్య ఆరోగ్య, కార్మిక, పంచాయితీరాజ్, గృహనిర్మాణ శాఖల మంత్రుల కార్యాలయాల ఉద్యోగులు అమరావతికి తరలివచ్చారు.

అమరావతి వస్తున్న ఉద్యోగులకు కనకదుర్గ వారధి వద్ద ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, సచివాలయ ఉద్యోగుల ప్రెసిడెంట్ మురళీకృష్ణ, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు, కృష్ణా జిల్లా ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు సాగర్ స్వాగతం పలికారు. విజయవాడ నుంచి వెలగపూడి సచివాలయానికి వ స్తున్న ఉద్యోగులకు రాజధాని గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. పరస్పర అభినందలతో పండుగ వాతావరణం ఏర్పడింది. ప్రారంభ  కార్యక్రమం పూర్తయ్యాక సాయంత్రం 4.30 గంటలకు ఎవరి వాహనాల్లో వారు  హైదరాబాద్‌కు బయలుదేరారు.

 మౌలిక వసతులూ కరువు...
 సొంత రాష్ట్రంలో పనిచేయటానికి ఎంతో ఉత్సాహంగా వెలగపూడికి వచ్చిన ఉద్యోగులకు కష్టాలు స్వాగతం పలికాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఉద్యోగులు తాత్కాలిక సచివాలయానికి సుమారు కిలోమీటరు దూరంలో దిగారు. అక్కడినుంచి ఐదవ భవనం వరకు వెళ్లే మార్గం బురదతో నిండిపోయి ఉండటంతో అతికష్టంతో చేరుకున్నారు. అక్కడ ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ప్రారంభమైన మూడుశాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో పనులింకా జరుగుతూనే ఉన్నాయి. ఉద్యోగులకు అవసరమైన మౌలిక వసతులు అస్సలు కనిపించలేదు. ముఖ్యంగా మంచినీటి సౌకర్యం, బాత్‌రూంలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.  ‘పనులు పూర్తి కాకపోయినా.. ఎందుకింత హడావుడిగా బురదలో తీసుకురావటం’ అని ఉద్యోగులు మాట్లాడుకోవడం కనిపించింది.  
 
  ఇబ్బందులు ఉంటాయని తెలుసు
 నిర్మాణంలో ఉన్న భవనంలో విధులు నిర్వహించడం ఇబ్బందని తెలుసు. అయినా సహకరించాల్సిన బాధ్యత మా పై వుంది. అలాగే ప్రభుత్వం కూడా త్వరగా పనులు పూర్తిచేసి భవనాన్ని ఉద్యోగులకు అప్పగిస్తే మేలైన పాలన నిర్వహించే అకాశం వుంటుంది.
 -మురళీకృష్ణ,రాష్ట్ర ఉద్యోగ సంఘం నాయకుడు
 
  త్వరగా పూర్తికావాలి
 ఎల్‌అండ్‌టీ  సంస్థ నిర్దేశించిన వ్యవధిలో భవననిర్మాణాలు పూర్తి చేసి ఇస్తే బాగుం టుంది. నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో చాలా ఇబ్బందులు వస్తాయి. వాటిని తట్టుకుని సేవ చేసేందుకు ఉద్యోగులు సిద్ధపడి వచ్చారు. వారిని అందరూ ఆదరించాలని కోరుతున్నాను.     -అశోక్‌బాబు,రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
 
  స్థానికులు సహకరించాలి
 దూరాభారంతో మహిళాఉద్యోగులు విధులు నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది. స్థానికులు పెయింగ్ గెస్ట్‌లుగా మహిళా ఉద్యోగులకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది. పరిస్థితులు చక్కబడేవరకు సచివాలయం దగ్గరలోని గ్రామాల ప్రజలు ఉద్యోగులకు సహకరించాలని కోరుతున్నాను.     
-ఎన్.సత్యసునీత,మహిళా ఉద్యోగుల సంఘాధ్యక్షురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement