
నీవిక్కడుంటే... నేనక్కడుంటా
మంత్రి తలసాని గ్రేటర్ ఎన్నికల వేళ...గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరిన ఓ ఒప్పందం గురించి వివరించి అందర్నీ ఆశ్చర్యపర్చారు.
'నీవిక్కడుంటే..నేనక్కడుంటా...'అంటూ మంత్రి తలసాని గ్రేటర్ ఎన్నికల వేళ...గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరిన ఓ ఒప్పందం గురించి వివరించి అందర్నీ ఆశ్చర్యపర్చారు. శుక్రవారం తార్నాక డివిజన్‌లో పర్యటించిన ఆయన..గత ఎన్నికల సమయంలో తాను, మంత్రి పద్మారావులు ఓ రహస్య ఒప్పందాన్ని అమలు చేశామని, అదే 'నీవిక్కడుంటే... నేనక్కడుంటా' అంటూ సెలవిచ్చారు.
అందులోని పరమార్ధాన్ని ఇలా వివరించారు...'2014 సార్వత్రిక ఎన్నికల ముందు..అన్నా నువ్వు టీఆర్‌ఎస్ పార్టీ ద్వారా సికింద్రాబాద్‌లో ఉండు...నేను తెలుగుదేశం పార్టీ ద్వారా సనత్‌నగర్‌లో ఉంటాను...ఇద్దరం ఎవరి నియోజకవర్గాన్ని వారు అభివృద్ధి చేసుకుందాం అని పద్మారావుకు చెప్పాను. ఆయన ఓకే అన్నారు. ఇద్దరం గెలిస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే తాము బదురుకున్నాం' అని తలసాని స్వయంగా తెలపడంతో సభలో నవ్వులు విరిశాయి.
సేవ చేసే ఉద్దేశం ఉన్న మాకు గెలిచే అవకాశం కూడా ఉండాలనే ఇలా చేశామని చెప్పారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.