దసరా, బక్రీద్ పండుగలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ జిల్లాలకు 1840 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.కోటేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి, సిటీబ్యూరో : దసరా, బక్రీద్ పండుగలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ జిల్లాలకు 1840 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.కోటేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవు. ఈ నెల 9 నుంచి 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌ల నుంచి బయలుదేరుతాయి. వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ (సిద్ధిపేట్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మినహా) రంగారెడ్డి జిల్లాలకు వెళ్లే అన్ని రెగ్యులర్ బస్సులు, 965 ప్రత్యేక బస్సులు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. హన్మకొండ, యాదగిరిగుట్ట స్పెషల్ బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి బయలుదేరుతాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల రెగ్యులర్ బస్సులు, 195 ప్రత్యేక బస్సులు కూడా ఎంజీ బస్‌స్టేషన్ నుంచే బయలుదేరుతాయి. మిగతా 685 బస్సులు జూబ్లీబస్‌స్టేషన్ నుంచి బయలుదేరుతాయి.
రిజర్వ్ చేసుకోండి...
ఈ బస్సులకు సంబంధించి మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు అన్ని ఏటీబీ కేంద్రాల్లో సీట్లు రిజర్వ్ చేసుకోవచ్చునని ఈడీ తెలిపారు. మరోవైపు ఎంజీబీఎస్, జేబీఎస్‌లలో విచారణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు సమాచారం కోసం కోఠీ ఏటీఎం ఫోన్ 99592 26126, అసిస్టెంట్ మేనేజర్ ఫోన్: 7382836361, విచారణ కోసం 040-12666,040-23434268 నంబర్లలో సంప్రదించవచ్చు.