జీహెచ్‌ఎంసీ వార్డుల (డివిజన్ల) రిజర్వేషన్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విమర్శల జోరు
వివిధ వర్గాల అసంతృప్తి
హైదరాబాద్
జీహెచ్‌ఎంసీ వార్డుల (డివిజన్ల) రిజర్వేషన్ల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని డివిజన్లు వరుసగా మహిళలకు రిజర్వయితే... మరికొన్ని ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఇరుగు పొరుగు వార్డులు ఒకే వర్గానికి రిజర్వు కావడంతో ప్రభుత్వ తీరును పలువురు ఆక్షేపిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన ఎక్కడ ఏ సామాజికవర్గం ఎక్కువగా ఉంటే... వారికి ఆ వార్డులు రిజర్వు కావాల్సి ఉంది. అలా కాకుండా ఇష్టానుసారం చేశారని మండిపడుతున్నారు.
అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు.. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు వారికి అనుకూలంగా రిజర్వ్ చేశారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలఅభ్యర్థులు బలంగా ఉన్న వార్డుల్లో సంబంధిత నాయకులను పోటీ చేసేందుకు వీలు లేకుండా ఇతర వర్గాలకు రిజర్వు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వార్డుల వారీగా బీసీల జనాభాను, వార్డుల మ్యాపులను ఎవరికీ తెలియనీయకుండా చేసుకున్నట్లే... రిజర్వేషన్లను సైతం తమకు అనుకూలంగా చేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లోని వార్డులు ఎక్కువగా మహిళలకు... మరికొన్ని నియోజకవర్గాల్లో అన్ని వార్డులూ జనరల్‌కు రిజర్వు కావడం అనుమానాలకు తావిస్తోంది. మంత్రులు, సర్కారులో హవా చూపించే ఎమ్మెల్యేలు తమ వారసులు గెలిచేందుకు వీలుగా వార్డులు రిజర్వు చేయించుకున్నార ని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో..
ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూక ట్‌పల్లి, ఎల్‌బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజవర్గాల్లో కింది విధంగా ఉన్నాయి.
ఉప్పల్‌లో మహిళలకు అగ్రతాంబూలం
బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పల్ నియోజకవర్గంలో ఏఎస్‌రావునగర్, నాచారం, చిలుకానగర్, హబ్సిగూడ, ఉప్పల్ డివిజన్‌లు జనరల్ మహిళలకు కేటాయించారు. ఒక స్థానాన్ని బీసీ మహిళకు, చర్లపల్లి బీసీ జనరల్, కాప్రా ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. మొత్తానికి అక్కడ మహిళల కు అధిక ప్రాధాన్యమివ్వడం విశేషం.
మల్కాజిగిరిలో బీసీలకు నో చాన్స్
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కనకారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మల్కాజిగిరి నియోజకవర్గంలో బీసీలకు మొండి చెయ్యి ఎదురైంది. అల్వాల్, నేరెడ్‌మెట్, వినాయక్ నగర్, మౌలాలీ,గౌతంనగర్ డివిజన్లు జనరల్ మహిళలకు కేటాయించారు. మచ్చబొల్లారం, వెంకటాపురాలను ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఈస్ట్ ఆనంద్‌బాగ్, మల్కాజిగిరిలను జనరల్‌కు పరిమితం చేశారు.
జనరల్‌కు ప్రాధాన్యం
కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనరల్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. అల్లాపూర్, బాలాజీనగర్‌లను జనరల్ మహిళలకు... పాతబోయిన్‌పల్లి, కూకట్‌పల్లి, ఫతేనగర్, కేపీహెచ్‌బీ, మూసాపేట్, బాలానగర్ డివిజన్‌లు జనరల్.
శేరిలింగంపల్లిలోనూ జనరల్‌కే ...
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మొత్తం 10 డివిజన్‌లలో 7 జనరల్ స్థానాలే. మిగిలిన మూడింటిని జనరల్ మహిళకు కేటాయించారు. కొండాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, ఆల్విన్ కాలనీ, వివేకానందనగర్ కాలనీ, మాదాపూర్, మియాపూర్‌లు జనరల్. హైదర్ నగర్, చందానగర్, హఫీజ్‌పేట్ జనరల్ మహిళకు కేటాయించారు.
మహిళలు... బీసీలకు సమ ప్రాధాన్యం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారం, రంగారెడ్డి నగర్, జగద్గిరిగుట్ట బీసీ జనరల్. సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల జనరల్ మహిళ. చింతల్ బీసీ మహిళకు... సూరారం జనరల్‌కు కేటాయించారు.
ఎల్‌బీనగర్‌లో జనరల్
మన్సూరాబాద్, హయత్ నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్, చంపాపేట్, లింగోజిగూడ, గడ్డి అన్నారం, చైతన్యపురి, కొత్తపేట్ జనరల్. నాగోల్ జనరల్ మహిళ. హస్తినాపురం ఎస్టీ మహిళకు కేటాయించారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని రెండు డివిజన్‌లు ఆర్‌కేపురం, సరూర్‌నగర్‌లు జనరల్ మహిళకే దక్కాయి.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో...
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువ వార్డులు మహిళలకే రిజర్వ య్యాయి. మంత్రుల ఇలాఖాలోని డివిజన్లు పూర్తిగా మహిళలకే కేటాయించడం విశేషం. ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ నేతృత్వం వహిస్తున్న నాంపల్లి నియోజకవర్గంలో బీసీ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం కొసమెరుపు.
బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నేతృత్వం వహిస్తున్నఖైరతాబాద్ నియోజకవర్గంలోని వేంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, హిమాయత్ నగర్, ఖైరతాబాద్ డివిజన్లు జనరల్ మహిళ. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ డివిజన్లు జనరల్ .
సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వం వహిస్తున్న సనత్‌నగర్ నియోజకవర్గంలో మహిళలకు ప్రాధాన్యం కల్పించారు. సనత్‌నగర్, అమీర్‌పేట్, బేగంపేట్, మోండ డివిజన్లు జనరల్ మహిళలకు.. రాంగోపాల్‌పేట బీసీ మహిళకు, బన్సీలాల్‌పేట్ ఎస్సీ మహిళకు రిజర్వయ్యాయి.
ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ నేతృత్వం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో పురుషులకు మొండి చెయ్యే. అడ్డగుట్ట, మెట్టుగూడ ఎస్సీ మహిళకు... తార్నాక, సీతా ఫల్‌మండి జనరల్‌కు, బౌద్ధనగర్ బీసీ మహిళకు కేటాయించారు.
బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్న ముషీరాబాద్ నియోజకవర్గంలోనూ మహిళలకే అధిక ప్రాధాన్యం.అడిక్ మెట్, గాంధీనగర్ జనరల్ మహిళ. రాంనగర్ జనరల్. ముషీరాబాద్ బీసీ మహిళ. బోలక్‌పూర్ బీసీ జనరల్, కవాడిగూడ డివిజన్ ఎస్సీ మహిళ.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నేతృత్వం వహిస్తున్న అంబర్‌పేట నియోజకవర్గంలో కాచిగూడ, నల్లకుంట, బాగ్ అంబర్‌పేట్ డివిజన్లు జనరల్ మహిళ. గోల్నాక బీసీ మహిళ. అంబర్‌పేట బీసీ జనరల్.
టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నేతృత్వం వహిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసఫ్‌గూడ, రహమత్‌నగర్, షేక్‌పేట్, వెంగళ్‌రావునగర్ జనరల్. ఎర్రగడ్డ బీసీ మహిళ. బోరబండ బీసీ జనరల్.
ఐఎం ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్ నేతృత్వం వహిస్తున్న నాంపల్లి నియోజకవర్గంలో ఆసిఫ్‌నగర్, రెడ్‌హిల్స్, విజయనగర్ కాలనీ, మల్లేపల్లి, అహ్మద్‌నగర్ బీసీ మహిళ. మెహిదీపట్నం బీసీ జనరల్.
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో....
చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఏడింటిలో మూడు డివిజన్లు జనరల్... రెండు జనరల్ మహిళ. మిగతా రెండింటిలో ఒకటి జనరల్‌కు, మరొకటి బీసీ జనరల్.
ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న యూకుత్‌పురా నియోజకవర్గంలో మూడు జనరల్... మూడు బీసీ మహిళ... ఒకటి బీసీ జనరల్.
చార్మినార్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పాషా ఖాద్రీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఒకటి జనరల్, ఒకటి జనరల్ మహిళ, రెండు బీసీ జనరల్, ఒకటి బీసీ మహిళకు రిజర్వు చేశారు.
బహదూర్‌పురా నియోజకవర్గానికి ఎమ్మెల్యేమౌజమ్ ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ నాలుగు బీసీ జనరల్, ఒకటి బీసీ మహిళ, ఒకటి ఎస్టీ జనరల్.
కార్వాన్ నియోజకవర్గానికి కౌసర్ మొయినుద్దీన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ మూడు బీసీ జనరల్... రెండు బీసీ మహిళ... ఒకటి జనరల్ మహిళ... ఒకటి ఎస్సీ జనరల్.
మలక్‌పేట్ నియోజకవర్గానికి బలాల ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అక్కడ జనరల్ మహిళకు మూడు, బీసీ మహిళకు ఒకటి, ఒకటి జనరల్‌కు, మరొకటి బీసీ జనరల్‌కు రిజర్వు చేశారు.
గత ఎన్నికల్లో సైదాబాద్ డివిజన్ లో టీడీపీ నుంచి గెలుపొందిన సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి ఈసారి పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. ఈ డివిజన్‌ను జనరల్ మహిళకు రిజర్వు చేశారు. దీంతో ఆయన సతీమణిని పోటీలో పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మెదక్ లోక్‌సభ నియోజక వర్గ పరిధిలో.. పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గంలోని మూడు డివిజన్లు జీహెచ్‌ఎంసీలో ఉన్నాయి. వీటిలో రెండు బీసీ జనరల్‌కు... ఒకటి జనరల్ మహిళకు రిజర్వు చేశారు.