రాజ్యాంగాన్ని గౌరవిస్తే హింస తగ్గుముఖం

Prof Haragopal comments on Constitution - Sakshi

ప్రొఫెసర్‌ హరగోపాల్‌ 

హైదరాబాద్‌:  పాలకులు రాజ్యాంగాన్ని గౌరవించి సక్రమంగా అమలు చేసినప్పుడే హింస తగ్గుతుందని ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ అన్నారు. శుక్రవారం సుందర య్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నిర్వహించిన చండ్రపుల్లారెడ్డి శతజయంతి ముగింపుసభలో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం పనికిరాదనేలా పాలకులు వ్యవహరిస్తున్నారని, హిందూ రాజ్యాన్ని స్థాపించాలనే భ్రమలో ఉన్నారని విమర్శించారు. ‘విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ఎంతవరకు సమంజసం, అందుకేనా ఆనాడు మహాత్మాగాంధీ విదేశీ వస్తువులను బహిష్కరించాలని పోరాటం చేసింది’ అని ప్రశ్నించారు.

సమానత్వం కోసం పుల్లారెడ్డి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమైనదని కొనియాడారు. పుల్లారెడ్డి మార్గం ఆదర్శనీయమని, విప్లవజీవితంలో ఆయన సఫలీకృతుడయ్యారని సీనియర్‌ జర్నలిస్ట్‌ మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో పుల్లారెడ్డి ఉద్యమబాట పట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ తెలంగాణ కార్యదర్శి వెంకటేశ్వరరావు, మహారాష్ట్ర కార్యదర్శి అశోక్‌ గాయల్, ఏపీ కార్యదర్శివర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గోవర్ధన్, ఏఐకేఎంఎస్‌ అధ్యక్షుడు అచ్యుతరామారావు, ఏపీ అధ్యక్షుడు రాజారావు, పుల్లారెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పీడీఎస్‌యూ జాతీయ కన్వీనర్‌ రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం పుల్లారెడ్డి జీవితచరిత్ర పుస్తకాన్ని బచ్చల రమేశ్‌ ఆవిష్కరించారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top