రాష్ట్ర రాజధాని నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో జరగబోతున్న ఓ కాంట్రాక్టు పెళ్లిని పోలీసులు అడ్డుకున్నారు.
రాష్ట్ర రాజధాని నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో జరగబోతున్న ఓ కాంట్రాక్టు పెళ్లిని పోలీసులు అడ్డుకున్నారు. సోమాలియా దేశస్థుడు సయ్యద్తో పాటు పెళ్లికి సర్వం సిద్ధం చేసిన ఖాజీని కూడా అరెస్టు చేశారు. రూ. 80 వేలు చెల్లించి, 15 రోజుల పాటు కాంట్రాక్టు పెళ్లి చేసుకునేలా ఒప్పందం కుదిరింది. దీనిపై పక్కా సమాచారం ముందే అందడంతో సౌత్ జోన్ పోలీసులు సయ్యద్ను, ఖాజీని అరెస్టు చేశారు. దాంతో ఓ అమాయకురాలు కాంట్రాక్టు పెళ్లి బారిన పడకుండా ఎలాగోలా బయటపడింది. కాంట్రాక్టు పెళ్లిళ్లను అరికడదామని డీసీపీ సత్యనారాయణ కోరారు.
ఫలక్నుమా ప్రాంతంలో జరగబోతున్న ఈ పెళ్లిని సరిగ్గా 2 నిమిషాల ముందు పోలీసులు అడ్డుకున్నారు. పెళ్లితోపాటు తలాక్ పత్రాలను కూడా సిద్ధం చేశారు. పెళ్లి అయిన వెంటనే తలాక్ పత్రాల మీద కూడా సంతకాలు చేయించుకునేలా అన్నీ మాట్లాడుకున్నారు. ఒక బ్రోకర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న 80 వేలలో రూ. 60వేలు మాత్రమే కుటుంబానికి ఇస్తారని, మిగిలిన మొత్తం బ్రోకర్కు వెళ్తుందని అంటున్నారు.
ఇటీవలి కాలంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో కాంట్రాక్టు పెళ్లిళ్ల పేరుతో అమాయకులైన అమ్మాయిలను దారుణంగా అమ్మేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లతో పాటు ముంబై లాంటి మహానగరాల నుంచి కూడా డబ్బున్నవాళ్లు ఇక్కడికొచ్చి, కంటికి నదురుగా కనపడిన అమ్మాయిలను కాంట్రాక్టు పెళ్లి చేసుకుంటున్నారు. నెల, రెండు నెలల చొప్పున ఈ కాంట్రాక్టులు ఉంటున్నాయి. ఆ తర్వాత వాళ్ల మానాన వాళ్లు వెళ్లిపోతారు. పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తమ కూతుళ్లను ఇలా కాంట్రాక్టు పెళ్లిళ్ల పేరుతో బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించుతున్నట్లు పోలీసులు తెలిపారు.