ఉద్యమంలా క్లీన్ సిటీ.. | Movement Clean City .. | Sakshi
Sakshi News home page

ఉద్యమంలా క్లీన్ సిటీ..

May 28 2016 12:13 AM | Updated on Aug 21 2018 12:12 PM

గ్రేటర్ హైదరాబాద్ వంటి మహానగరం మొత్తం పరిశుభ్రంగా ఉండాలంటే ‘క్లీన్ సిటీ’ కార్యక్రమం ఉద్యమంలా నిరంతరం సాగాల్సిన ...

పరిశుభ్ర గ్రేటరే లక్ష్యం    
అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధి   
‘సాక్షి’ జనసభలో గ్రేటర్ కమిషనర్ జనార్దన్ రెడ్డి

 

ఉప్పల్: గ్రేటర్ హైదరాబాద్ వంటి మహానగరం మొత్తం పరిశుభ్రంగా ఉండాలంటే ‘క్లీన్ సిటీ’ కార్యక్రమం ఉద్యమంలా నిరంతరం సాగాల్సిన అవశ్యకత ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం ఉప్పల్‌లోని మేకల జంగారెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన జనసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శానిటేషన్ విభాగంలో పనిచేసే కార్మికులను, వారి పనితీరును క్షేత్రస్థాయిలో అందరికి తెలియచేసే నిమిత్తం పరిచయ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైనేజీ, త్రాగునీరు, కాలుష్యం, ట్రాఫిక్, విద్యుత్, రోడ్లు వంటి సమస్యలన్నింటినీ నిరంతరం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే పరిష్కరించగలుగుతామని స్పష్టం చేశారు. నగరంలో ఈ నెల 6వ తేదీన 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల బీభత్సం ప్రకృతి వైపరీత్యమన్నారు. కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ పనులు ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం, ఆయా శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కారణంగా తవ్వకాలు, రోడ్ల డ్యామేజ్ వంటి సమస్యలు తరచూ తలెత్తుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులమంతా ప్రతి నెల మొదటి శనివారం సమన్వయ సమావేశాన్ని ఏర్పాటుచేసుకొని సమస్యల పరిష్కారంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. వాట్సప్ గ్రూపును, వెబ్ పోర్టల్‌ను ఏర్పాటుచేసుకున్నామని చెప్పారు. నెల రోజుల్లోనే మూడు, నాలుగు సార్లు ప్రకృతి వైపరిత్యాలు చోటుచేసుకున్నాయని, రెండుసార్లు 150 కిలోమీటర్ల  వేగంతో గాలులు వీచడంతో చెట్లు కూలడం, విద్యుత్ తీగలు తెగడం వంటివి జరిగాయని పేర్కొన్నారు.


ఇలాంటి సమయంలో ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు 100 నెంబరు ఫోన్ సౌకర్యం కల్పించామని తెలిపారు. ఉప్పల్‌లో తై బజారు కాంట్రాక్టు రద్దు విషయమై చర్చించి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తామని అన్నారు. నగరంలో ప్రతిరోజు ఐదు వేల మెట్రిక్ టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతుందని, దీనిని ఎలా తగ్గించుకోవాలో ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కిచెన్‌లలో తడి, పొడి చెత్తకు పెళ్లి చేస్తున్నారని, అలా కాకుండా వేరు చేయాలని సూచించారు. తద్వారా చెత్తను రీసైక్లింగ్ చేసుకోవచ్చని కమిషనర్ జనార్దన్‌రెడ్డి అన్నారు. తడి పొడి చెత్త సేరకణ, రీసైక్లింగ్ కార్యక్రమం ఒక డివిజన్ నుండి ప్రారంభమై గ్రేటర్‌లోని అన్ని డివిజన్‌లలో ఉద్యమంలా సాగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఉప్పల్‌లో రహదారి వెడల్పుకు భూ సేకరణ, నష్ట పరిహారం వంటి సమస్యలున్నాయని, త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. రానున్న వర్షాకాలంలో హరితహారంను పెద్దఎత్తున చేపడుతామని, వేర్లు భూమి లోపలికి వెళ్లే చెట్లను నాటుతామని తెలిపారు. ఉప్పల్ భగాయత్ రైతుల భూ సమస్యను త్వరలోనే పరిష్కారం చూపుతామని కమిషనర్ హామీ ఇచ్చారు. కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్, ఉప్పల్ కార్పొరేటర్ మేకల అనలా హన్మంత్‌రెడ్డిలు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. జోనల్ కమిషనర్ రఘుప్రసాద్, ఉప్పల్ సర్కిల్ డీసీ విజయకృష్ణ, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement