
3 లక్షల 3 వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం
ఇప్పటి వరకూ 20 వేల టన్నుల వ్యర్ధాలు సేకరణ
అధికారులు, సిబ్బందికి మేయర్, కమిషనర్ అభినందన
పారిశుద్ధ్య కార్మికుల సేవలకు ప్రత్యేక ప్రశంస
లక్డీకాపూల్ : గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా, విజయవంతంగా జరిగిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షల 3 వేల గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారన్నారు. పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది, పోలీస్, విద్యుత్, హెచ్‌ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ అభినందనలు తెలిపారు. పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యంతోపాటు టాయిలెట్లు, సరిపడా క్రేన్ల ఏర్పాటు తదితర అంశాల్లో జీహెచ్‌ఎంసీ చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి.
నిమజ్జనం మార్గం పొడవునా ఏర్పాటు చేసిన గణేశ్ యాక్షన్ టీమ్స్ రోడ్లపై చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలతో ఫలితం కనిపించింది. రోడ్డు సేఫ్టీ డ్రైవ్‌లో నగరంలోని రోడ్లకు మరమ్మతులు చేపట్టడం, ప్రధానంగా నగరంలో ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్‌లతో సహా నిమజ్జన శోభాయాత్ర జరిగే 303 కిలోమీటర్ల మేర మార్గం మరమ్మతులు చేపట్టడంతో ఊరేగింపు సాఫీగా, సురక్షితంగా, వేగంగా జరిగిందని పేర్కొన్నాన్నారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తూ 15 వేల మంది సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో మూడు షిఫ్టులో విధులు నిర్వర్తించడంతో పారిశుధ్య నిర్వహణలో ఇబ్బందులు కనిపించలేదన్నారు.
72 కృత్రిమ కొలనులతో ప్రధాన చెరువులపై ఒత్తిడి లేకుండా, ట్రాఫిక్ జామ్‌లు లేకుండా, భక్తులు స్థానికంగానే నిమజ్జనం అయ్యేలా చూడగలిగామన్నారు. జీహెచ్‌ఎంసీ కల్పించిన ఉచిత భోజన సౌకర్యం భక్తులు, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కారి్మకుల సేవలను మేయర్, కమిషనర్ ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రÔ¶ ంసించారు.. వారి నిరంతర సేవల వల్లే ఇప్పటి వరకూ 20 వేల అధిక టన్నుల వ్యర్థాలను సేకరించినట్లు తెలిపారు. ఈ వ్యర్థాలను జవ జవహర్ నగర్ లోని ప్రాసెసింగ్ సెంటర్‌కు పంపామన్నారు.
గణేష్ ఉత్సవసమితి సభ్యులు, మీడియా, ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు
వినాయక చవితి ఉత్సవం, మహా నిమజ్జనం కార్యక్రమం సజావుగా జరిగేలా యంత్రాంగానికి తమవంతు సహకారం అందించిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, మీడియా, ప్రజలకు మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ కర్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్‌ఎంసీ యంత్రాగం, ప్రభుత్వ శాఖలు చేసిన ఏర్పాట్లను, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా క్రియాశీలంగా వ్యవహరించిందని ఆదివారం ఒక ప్రకటనలో కొనియాడారు.