తెలంగాణ భవన్‌లో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో శంభీపూర్‌రాజు, సుధీర్‌రెడ్డి, సబిత, తలసాని, శ్రీనివాస్‌గౌడ్, కాలేరు వెంకటేశ్ తదితరులు
జూబ్లీహిల్స్‌లో గెలుపు పక్కా.. మెజారిటీ కోసం శ్రమించండి
గ్రేటర్ హైదరాబాద్ బీఆర్‌ఎస్ నాయకులతో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్‌కాలనీ: బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలపై రాబోయే రోజుల్లో అనర్హత వేటు పడటం ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పవని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలో పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.
భారీ మెజారిటీకోసం కష్టపడాలని నేతలకు సూచించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నాయకులందరూ కలసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు ఉన్న బలాన్ని ఈ ఉప ఎన్నికలో చాటాల్సిన అవసరం ఉందన్నారు. ‘బీఆర్‌ఎస్ నాయకులు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు హైదరాబాద్ సమస్యలపై అవగాహన ఉంది.
హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేసిన పథకాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలి’అని కేటీఆర్ సూచించారు. ప్రచారంలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేయడంతో పాటు నగరంలో రోజురోజుకూ దిగజారుతున్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురికినీటి కాలువల నిర్వహణ వంటి సమస్యలను ఎత్తి చూపాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని పక్కన పెట్టి, కాంగ్రెస్ కేవలం రాజకీయాలకే పాల్పడుతోందన్నారు.
జూబ్లీహిల్స్ నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర
జూబ్లీహిల్స్ నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, ఈ నియో జకవర్గంలో తిరిగి గులాబీ జెండాను ఎగురవేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణభవన్‌లో షేక్‌పేట డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు తోట మహేశ్‌తో పాటు పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.


