
బైక్‌లు 62.85 లక్షలు.. కార్లు 15.72 లక్షలు
ఏటా భారీగా పెరుగుతున్న వ్యక్తిగత వాహనాలు
ఉద్యోగ, ఉపాధి పనుల కోసం భారీగా పెరిగిన బైక్‌ల వినియోగం
ప్రజారవాణా వాహనాల తగ్గుముఖం
రవాణాశాఖ తాజా గణాంకాల వెల్లడి
గ్రేటర్‌లో ద్విచక్ర వాహనాలు టాప్‌గేర్‌లో పరుగులు తీస్తున్నాయి. ఏటా లక్షలాది వాహనాలు కొత్తగా వచి్చచేరుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాల్లో ఉద్యోగ, ఉపాధి పనులు, వ్యాపార కార్యకలాపాల్లో టూవీలర్ల వినియోగం అనూహ్యంగా పెరిగింది. ఆ తరువాత రెండోస్థానంలో వ్యక్తిగత కార్లే రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. రవాణాశాఖ తాజా గణాంకాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం అన్ని రకాల వాహనాల సంఖ్య 85,22,286కు చేరింది. ఇందులో ద్విచక్రవాహనాలు 62,85,582 ఉన్నాయి. మొత్తం వాహనాల్లో ఇంచుమించు మూడొంతులు ఇవే కావడం గమనార్హం. మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలు ఎక్కువగా వినియోగించే కార్లు 15,72,795కు చేరుకున్నాయి.
మహానగర విస్తరణకు అనుగుణంగా ప్రజా రవాణా సదుపాయాలు విస్తరించకపోవడం వల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం అనివార్యంగా మారింది. ఇదే సమయంలో సిటీబస్సుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. నాలుగేళ్ల క్రితం 3,580 బస్సులు అందుబాటులో ఉంటే ఇప్పుడు 2,500 మాత్రమే ఉన్నాయి. నిజానికి రవాణా రంగానికి చెందిన నిపుణుల అంచనాల మేరకు సుమారు 6,000 బస్సులు అందుబాటులోకి రావలసి ఉండగా అందుకు భిన్నంగా వాటి సంఖ్య తగ్గింది. మరోవైపు ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రోరైళ్లు పెరగలేదు. కోవిడ్ నుంచి ఎంఎంటీఎస్‌ల వినియోగం కూడా తగ్గింది. – సాక్షి, హైదరాబాద్

హైస్పీడ్‌లో బైక్
ఏటా 3 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. ప్రతి మనిíÙకి ఒక మొబైల్ ఫోన్ తప్పనిసరి అయినట్లుగానే బైక్ కూడా తప్పనిసరిగా మారింది. 18 ఏళ్లు దాటిన యువత మొదలుకొని 65 ఏళ్లు దాటిన వయోధికుల వరకు ద్విచక్ర వాహనాలపైనే ఆధారపడి ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు, ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరగడంతో డెలివరీ వర్కర్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. బైక్‌ట్యాక్సీ సేవలూ పెరిగాయి. కార్ల విషయానికొస్తే.. ఏటా లక్షకు పైగా కొత్తవి రోడ్డెక్కుతున్నాయి. ఇంటిల్లిపాది కలిసి వెళ్లేందుకు కారు సౌకర్యవంతంగా ఉండటంతో వీటి కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
త్వరలో కోటి బండ్లు
వ్యక్తిగత వాహనాల వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న దృష్ట్యా మరో రెండు, మూడేళ్లలో గ్రేటర్‌లో వాహనాల సంఖ్య కోటికి చేరుకొనే అవకాశం ఉంది. ఏటా 5 లక్షల వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. కాగా, రహదారుల విస్తరణ లేకపోవడం వల్ల రోడ్లపై వాహనాల రద్దీ భారీగా పెరిగి గ్రిడ్‌లాక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
సొంత బండి ఆదాయమార్గమైంది
ప్రజారవాణా సదుపాయాలను బాగా పెంచి వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. కానీ ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనం కేవలం ప్రయాణ సాధనమే కాకుండా ఒక ఆదాయమార్గంగా మారింది. బండి ఉంటే చాలు ఏదో ఒక ఉపాధి లభిస్తుందనే భరోసా ఏర్పడింది. జీవితంలోని అన్ని రంగాల్లోకి ఆన్‌లైన్ మార్కెట్ విస్తరించింది. ఇది ఒక అనివార్యమైన పరిస్థితి. అందుకే మిగతా కేటగిరీలకు చెందిన వాటి కంటే బైక్‌లే ఏటా ఎక్కువగా నమోదవుతున్నాయి.
– సి.రమేశ్, జేటీసీ, హైదరాబాద్