బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాలివీ.. స్థానిక భాగ్యలక్ష్మికాలనీకి చెందిన సుకుమార్ దాస్ కిరాణ దుకాణం నిర్వహిస్తుంటాడు. ఇదే కాలనీకి చెందిన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి అయిన రాకేశ్‌కుమార్(26) అతడికి రూ.6,000 బకాయి పడ్డాడు. ఈ మొత్తం ఇవ్వాలని సుకుమార్‌దాస్ శుక్రవారం సాయంత్రం అతడిని అడిగాడు. తన ఇంటికి వస్తే డబ్బు అందజేస్తానని రాకేశ్ బదులిచ్చాడు.
దీంతో సుకుమార్ దాస్ తన కుమార్తె(10)ను అతడి ఇంటికి పంపాడు. రాకేశ్‌కుమార్ ఆమెను ఇంట్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు విషయం తెలిపింది. ఈ మేరకు వారు శనివారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.