మూడో పెళ్లి కోసం మోజు పడి..
ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ మహిళలను మోసం చేస్తున్న ఓ నిత్య పెళ్లికొడుకును చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ మహిళలను మోసం చేస్తున్న ఓ నిత్య పెళ్లికొడుకును చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై కోస్గి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం....యాకుత్‌పురాకు చెందిన ప్రైవేట్ ఉద్యోగం చేసే మహ్మద్ నజీముద్దీన్ ఇమ్రాన్(31) 2008లో నసీమా యాస్మిన్‌ను, ఆమెకు తెలియకుండా 2014లో షమీంను వివాహం చేసుకున్నాడు. ఒకరి విషయం మరొకరికి తెలియకుండా ఇద్దరితో వేర్వేరు కాపురం పెట్టాడు.
అంతటితో ఆగని ఇమ్రాన్ బార్కాస్‌కు చెందిన ఫౌజియా బేగం ఫోన్ నంబర్‌ను సేకరించి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను కూడా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు. భర్త చనిపోయి ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్న ఫౌజియా బేగం ఈ విషయాన్ని తన సోదరికి తెలిపింది. ఆమె తన భర్త అబ్దుల్ నజీబ్‌కు విషయం చెప్పడంతో అతడు ఆరా తీశాడు. దీంతో ఇమ్రాన్ అసలు రంగు బయటపడింది. నజీబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు.