కారెక్కనున్న రమణ?

కారెక్కనున్న రమణ?


- త్వరలో గులాబీ కండువా కప్పుకోనున్న టీటీడీపీ అధ్యక్షుడు

- ఇప్పటికే సీఎం, మంత్రి హరీశ్‌తో మంతనాలు

- మరో ఎమ్మెల్యే సండ్ర కూడా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం

- పాలేరు ఉప ఎన్నిక లోపే జంప్!


 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీకి మరో పెద్ద షాక్ తగలనుందా..? పదిహేను మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే పన్నెండు మంది గట్టు దాటడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ పార్టీలో మరో భారీ కుదుపు ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టీటీడీపీ విషయంలో పట్టింపే లేనట్టు ఉండటంతో తమ రాజకీయ భవిష్యత్ అంధకారమవుతుందని ఆందోళన చెందుతున్న ముఖ్య నాయకులు కొందరు పార్టీని వీడి గులాబీ గూటికి చేరడమే శ్రేయస్కరమన్న అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు.


పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కొద్ది రోజుల్లోనే గులాబీ కండువా కప్పుకోవడానికి అన్ని లాంఛనాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. టీడీపీకి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేరికకు కూడా ముహూర్తం కుదిరిందని అంటున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు నేతల తో పాటు పలువురు నాయకులు టీడీపీ గోడ దూకుతారని కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజా పరిణామాలు ఈ ప్రచారాన్ని మరింత బలపరిచేవిగా ఉన్నాయి.


 టీడీపీకి భవిష్యత్తు ఏదీ?

గడిచిన రెండేళ్లుగా అధికార టీఆర్‌ఎస్‌తో సై అంటే సై అన్న నాయకులు కూడా కాలక్రమేణా జావగారి పోయారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ‘ఓటుకు కోట్లు’ కేసులో పార్టీ పీకల్లోతు కూరుకుపోవడం, ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు ఆడియో టేపులూ బహిరంగమవడంతో తెలంగాణ టీడీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. దీంతో తెలంగాణ పార్టీ వ్యవహారాల విషయంలో చంద్రబాబు అంటీముట్టనట్టుగానే ఉంటున్నారన్నది పార్టీ వర్గాల అభిప్రాయం.


రెండోసారి టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మాజీ మంత్రి ఎల్.రమణ నామమాత్రం అయ్యారన్న భావన వ్యక్తమవుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడైన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తుండడం, అధినేత పట్టించుకోకపోవడం వంటి పరిణామాలతో ఇక పార్టీలో కొనసాగడంలో అర్థం లేదన్న అభిప్రాయానికి రమణ వచ్చారని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో పార్టీ నిలబడే అవకాశాలు కనుచూపు మేరలో లేవన్న నిశ్చితాభిప్రాయనికి వచ్చిన పలువురు టీటీడీపీ నేతలు ప్రత్యామ్నాయం వెదుక్కునే పనిలో ఉన్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎల్.రమణ టీఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.


మంత్రి హరీశ్‌తో మంతనాలు?

తన చేరికపై ఇప్పటికే ఒకటికి  రెండుమార్లు సీఎం కేసీఆర్‌తో మాట్లాడిన ఎల్.రమణకు మంత్రి హరీశ్‌తో ‘లంచ్ మీటింగ్’ కూడా జరిగిందని విశ్వసనీయంగా తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎల్.రమణ ఓడిపోయారు. టీఆర్‌ఎస్ కూడా ఆ స్థానం లో ఓడిపోయింది. జగిత్యాలలో నాయకత్వ లేమి ఉందన్న ఆలోచనతోనే ఎల్.రమణను పార్టీలోకి ఆహ్వానిస్తూ మంతనాలు జరిపారని వినికిడి. ఇక్కడ్నుంచి కాంగ్రెస్‌కు చెందిన జీవన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


1994 సార్వత్రిక ఎన్నికల నుంచి మొన్నటి 2014 సార్వత్రిక ఎన్నికల దాకా ప్రధాన పోటీ జీవన్‌రెడ్డి, ఎల్.రమణల మధ్యే కొనసాగుతోంది. మూడో వ్యక్తికి అవకాశం రాలేదు. దీంతో భవిష్యత్ రాజ కీయ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్ సమాలోచనలు జరిపిందని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే కొద్ది రోజుల్లోనే రమణ గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేరికపైనా టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. పాలేరు ఉప ఎన్నికలు ముగిసేలోపే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top