కాళేశ్వరం ఓ అద్భుతం

Kaleshwaram is a miracle - Sakshi

ఇంత వేగమైన పనులు ఎక్కడా చూడలేదు

కేంద్ర జల సంఘం బృందం కితాబు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న తీరుపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తరహా వేగవంతమైన పనులను ఇంతకుముందు ఎక్కడా చూడలేదని, ఇదో అద్భుతమని కితాబిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే విభిన్నమైనదని, ఈ ప్రాజెక్టుతో బహుళ ప్రయోజనాలు కలుగనున్నాయని పేర్కొంది. అనుకున్న సమయానికి, నిర్ణయించిన వ్యయంతో ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం అత్యంత ముఖ్యమని, ఈ సవాలును ప్రభుత్వం అధిగమిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది.

కాళేశ్వరం పనులు జరుగుతున్న తీరును రెండ్రోజులపాటు ప్రత్యక్షంగా పరిశీలించిన సీడబ్ల్యూసీకి చెందిన ప్రాజెక్టు అప్రైజల్‌ ఆర్గనైజేషన్‌(పీఏఓ) సీఈ సీకేఎల్‌ దాస్, హైడ్రాలజీ డైరెక్టర్‌ ఎన్‌.ఎన్‌.రాయ్, కాస్ట్‌ అప్రైజల్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్‌ ముఖర్జీ బుధవారం జలసౌధలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా కూడా కాళేశ్వరం అన్నీ విధాలా ప్రత్యేకమైనదని బృందం సభ్యులు వ్యాఖ్యానించారు. ‘‘కాళేశ్వరం సమీకృత, బహుళార్థ సాధక ప్రాజెక్టు. మిడ్‌ మానేరు, ఎస్సారెస్పీ సహా పలు ప్రాజెక్టులకు కాళేశ్వరం ఆధారం కాబోతోంది.

ఇలా ఒక భారీ ప్రాజెక్టును మరికొన్ని సాగునీటి ప్రాజెక్టులతో అనుసంధానం చేస్తున్న ప్రక్రియ ఇక్కడే కనిపిస్తోంది. నిర్మాణాలు, ప్రణాళిక, పనులు జరుగుతున్న తీరు మమ్ముల్ని ఆకట్టుకున్నాయి. రేయింబవళ్లు మూడు షిఫ్టులలో జరుగుతున్న పనుల వేగాన్ని చూస్తుంటే వచ్చే వానాకాలం కల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి మైలురాయి దాటుతుందని భావిస్తున్నాం. మేం దేశంలో, దేశం బయట అనేక ప్రాజెక్టుల పరిధిలో పర్యటించినా.. ఈ తరహా వేగవంతమైన పనులు ఎక్కడా చూడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు మరో 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటిని అందించే అవకాశం ఉంది.

కోట్లాది మంది రైతుల ప్రయోజనాలతోపాటు బహుళ ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఒక అద్భుతం’’అని సీడబ్ల్యూసీ పీఏఓ సీఈ సీకేఎల్‌ దాస్‌ పేర్కొన్నారు. జూన్‌నాటికి ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని, పనులు ఇలాగే జరిగితే అనుకున్న గడువులోపే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం చేయరాదని, వ్యయాలు పెరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అనుకున్న సమయానికే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో వేగం మరింత పెంచాలని సూచించారు. ఇప్పటికే ప్రాజెక్టుకు వివిధ డైరెక్టరేట్‌ల నుంచి అనుమతులు వచ్చాయని, మిగతా అనుమతులు పరిశీలనలో ఉన్నాయన్నారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టే అవకాశం ఉందా అని మీడియా అడగ్గా.. దీనిపై తాము ఎలాంటి ప్రకటన కానీ, వ్యాఖ్యలు కానీ చేయబోమన్నారు.

నీటి లభ్యత పుష్కలం
మేడిగడ్డ వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉందని హైడ్రాలజీ డైరెక్టర్‌ నిత్యానంద రాయ్‌ అన్నారు. 284.3 టీఎంసీల మేర లభ్యత నీరుందని, కాళేశ్వరం అవసరాలకు ఇది సరిపోతుందన్నారు. కాళేశ్వరం నిర్మాణ పనులు చాలా సంతృప్తికరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కాళేశ్వరాన్ని నిర్ణీత గడువు లోగా పూర్తయ్యేలా ప్రణాళికా బద్ధంగా పని చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎస్‌.కె.జోషి అన్నారు.

నిర్ణీత గడువు లోపే ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు సృష్టిస్తామని అన్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరం చీఫ్‌ ఇంజనీర్లు నల్లా వెంకటేశ్వర్లు, హరి రామ్, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండేలు పాల్గొన్నారు. అనంతరం సీడబ్ల్యూసీ బృందం జలసౌధలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్‌ల ద్వారా కాళేశ్వరం పనుల తీరును ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top