
కాంగ్రెస్ అబద్ధాలకు ‘కాళేశ్వరం’ కమిషన్ ముసుగు తొడిగారన్న కేసీఆర్
ఏళ్లుగా బీఆర్‌ఎస్‌పై చేస్తున్న విమర్శలనే నివేదికలో పొందుపరిచారు
ఎర్రవల్లిలో పార్టీ ముఖ్యనేతలతో భేటీలో కేసీఆర్
అసెంబ్లీకి హాజరై వాస్తవాలను వివరించే యోచన
అవసరమైతే సుప్రీంను ఆశ్రయించాలనే భావన
నేడు తెలంగాణ భవన్‌లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో రెండు పియర్స్ కుంగుబాటును సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. గతంలో ప్రతిపక్ష పార్టీగా, నేడు అధికార పార్టీగా కాంగ్రెస్ వల్లెవేస్తూ వస్తున్న అబద్ధాలకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ముసుగు వేసి బీఆర్‌ఎస్‌పై బురద చల్లే ప్రయ త్నం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అబ ద్ధాలను అసెంబ్లీతోపాటు ప్రజాక్షేత్రంలోనూ ఎండగట్టాలని పార్టీ నేతలను ఆదేశించారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవల్లి నివాసంలో కొన్ని రోజులుగా పార్టీ కీలక నేతలు కె. తారక రామారావు, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో వరుస భేటీలు జరుపుతున్న కేసీఆర్.. సోమవారం కూడా వారితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. బీజేపీ ప్రేరేపిత జాతీయ డ్యామ్‌ల భద్రత ప్రాధికార సంస్థ (ఎన్డీఎస్‌ఏ)ను అడ్డుపెట్టుకొని తయారు చేయించిన నివేదికపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని కేసీఆర్ ఆదేశించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
అసెంబ్లీ వేదికగానే అసలు నిజాలు చెబుదాం
పీసీ ఘోష్ కమిషన్ నివేదికను త్వరలో అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తామని సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై ఈ భేటీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. గతంలో అధికారపక్షంగా రాష్ట్రంలో సాగునీటి రంగం స్థితిగతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రజలకు వివరించినట్లుగానే కమిషన్ విచారణ నివేదికపైనా స్పందించాలని కేసీఆర్ అభిప్రాయపడ్డట్లు తెలియవచ్చింది.
ఈ అంశంపై తానే అసెంబ్లీకి స్వయంగా హాజరై వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ తప్పూ చేయనందునే పీసీ ఘోష్ కమిషన్ విచారణకు తనతోపాటు హరీశ్‌రావు హాజరై వివరణ ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారని... అదే రీతిలో అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది.
అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రభుత్వం వ్యవహరించే తీరునుబట్టి అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై కక్షపూరిత చర్యలకు పాల్పడితే అనుసరించాల్సిన వ్యూహంపైనా కేసీఆర్ ఈ భేటీలో చర్చించినట్లు తెలియవచ్చింది.
నేడు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఎంచుకున్న అంశాలను మాత్రమే కేబినెట్‌లో ప్రభుత్వం చర్చించినట్లు బీఆర్‌ఎస్ అభిప్రాయపడుతోంది. సోమవారం కేబినెట్‌లో చర్చించిన కమిషన్ సంక్షిప్త నోట్‌లోని అంశాలను పార్టీ నేతలకు వివరించి ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలకు కమిషన్ నివేదికలోని డొల్లతనాన్ని, రేవంత్ సర్కారు కుట్రలను ప్రజలకు విడమర్చి చెప్పాలని హరీశ్‌రావును కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హరీశ్‌రావు తెలంగాణ భవన్‌లో కమిషన్ నివేదికపై ప్రభుత్వ కార్యదర్శుల త్రిసభ్య కమిటీ ఇచ్చిన సంక్షిప్త నివేదికలో పేర్కొన్న వివరాల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ ప్రజెంటేషన్‌ను రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ముఖ్య నేతలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని కేడర్‌ను కేటీఆర్ ఆదేశించారు. ప్రజెంటేషన్ అనంతరం ముఖ్య నేతలు ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రభుత్వ తీరును ఖండించాలని నిర్దేశించారు.
నేడు ఢిల్లీకి కేటీఆర్
కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో జరిగే సమావేశానికి హాజరు కానుంది. ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళితోపాటు వివిధ పార్టీలు సమర్పించిన పెండింగ్ ప్రతిపాదనలపై చర్చలు జరగనున్నాయి.