ముద్రగడపై ప్రయోగం వికటించిందా?

ముద్రగడపై ప్రయోగం వికటించిందా? - Sakshi


 


- రంగాను హతమార్చిన పని ఎవరిది?

- సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడాల్సి మాటలా ఇవి..

- బాబు రాయలసీమ వాసినన్న విషయం మరిస్తే ఎలా..

- బాబు ఏపీ ముఖ్యమంత్రా లేక ఆంధ్రా వాసులకే సీఎం ఆ?

- ముద్రగడపై ప్రయోగం వికటించిందా?


-రాయలసీమ అభివృద్ధి సమితి ఫౌండర్ జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి ఆక్షేపణ


సాక్షి, సిటీబ్యూరో: తూర్పు గోదావరి జిల్లా తుని సంఘటన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన ఎంపీ మురళీమోహన్ రాయలసీమ సంస్కృతిని కించపరుస్తూ మాట్లాడటం ఎంత మాత్రం సరైంది కాదని రాయలసీమ అభివృద్ధి సమితి ఫౌండర్ జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి ఆక్షేపించారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో రాయలసీమ అభివృద్ధి సమితి, గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (గ్రాట్) ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ తుని సంఘటనకు రాయసీమవారిని, ముఖ్యంగా పులివెందుల వాసులను బాధ్యులు చేయటం ఏమిటని ప్రశ్నించారు.ఈ కేసు విచారణలో ఉండగానే, నిజానిజాలు బయటకు రాకముందే మాట్లాడాల్సిన అంత అవసరం ఏం వచ్చిందని నిలదీశారు.  మందస్తు కుట్రతో విచారణ అధికారుల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ పేరు, పులివెందుల పేర్లు తీసుకువచ్చారన్నారు. రాష్ట్రాని ప్రత్యేక హోదా ఇస్తే ఎక్కడ రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తారోనన్న భయం  చంద్రబాబుకు పట్టుకుందని ఎద్దేవా చేశారు. 


వచ్చే పరిశ్రమలన్నీ అమరావతి దాని చుట్టూ ఏర్పాటు చేసుకోవాలన్నా కుట్రతో చంద్రబాబు ఆయన అనుచర గణం ఒక పథకం ప్రకారం రాయలసీమ అంటే అందరికి భయబ్రాంతులు కలిగేలా ప్రచారం సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఇలా మాట్లాడుతూ ఉంటే రాయసీమ ప్రజా ప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం స్పందించక పోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకే రాష్ట్రంలో ఉంటున్న ప్రజలలో ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా మురళీమోహన్,  చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి సమితి వ్యవస్థాపకుడు, విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి ఎ. హనుమంతరెడ్డి మాట్లాడుతూ కాపుల నేత రంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతిలో దీక్ష చేస్తుండగా బస్సులో వచ్చి హతమార్చిన సంస్కృతి ఎవరిదని ప్రశ్నించారు.


అదే రంగా అన్న రాధాని మోసగించి చంపిన సంస్కృతి ఎవరిదని నిలదీశారు.  అదే ఎత్తుగడ ముద్రగడ పద్మనాభం మీద ప్రయోగించగా అది వికటించిందా ? అని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే రాయలసీమ ప్రజల మీద నింద మోపుతున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. కారంచేడు వంటి హింసాత్మక ఘటనలు ఎవరి సంస్కృతి, అలాగే ఆస్తి కోసం చిన్నారి వైష్ణవిని చంపిన సంస్కృతి ఎవరిదని ప్రశ్నించారు.
రాయలసీమలో ఎన్నో రైళ్లు తగులబెట్టారు?  శ్రీలక్ష్మి వంటి ఎందరో అమాయక స్త్రీలను చంపిన సంస్కతి ఎవరిదో ప్రజలకు తెలియనది కాదన్నారు. 2014లో రేప్ కేసుల్లో కృష్ణా జిల్లాలో 144, పశ్చిమ గోదావరిలో 139, తూర్పు గోదావరి జిల్లాలో 77, గుంటూరు జిల్లాలో 87 నమోదు అయితే తరచు సీఎం బాబు ప్రస్తావించే పులివెందుల ఉన్న కడప జిల్లాలో 29, కర్నూల్‌లో 31, అనంతపురంలో 35, చిత్తూరులో 49 కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు.


క్రైమ్ రేట్ ఒక లక్ష జనాభాకు గుంటూరులో 620, కష్ణాలో 623, పులివెందుల ఉన్న కడపలో 182 నమోదు అయినట్లు చెప్పారు. దాని సంబంధించిన డేటాను మీడియా ముందు ఉంచుతున్నానని హనుమంతరెడ్డి చెప్పారు. ఏపీ పాలకులు ఇలాగే వ్యవహరిస్తే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటుకు యువత ముందుకు కదిలినా ఆశ్చర్యపోవాల్సి అవసరం ఉండదన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top