హైదరాబాద్ నగరంలో ముందెన్నడూ లేని విధంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి బీభత్సం సృష్టించాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ముందెన్నడూ లేని విధంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి బీభత్సం సృష్టించాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. దీనిని త్వరితంగా చక్కదిద్దడం ద్వారా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా ప్రభుత్వానికి ఉందని చాటి చెప్పామని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసిన గాలివాన సహాయక చర్యలను జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నుంచి మంత్రి శనివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
గతంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండేది కాదని... తమ ప్రభుత్వంలో వివిధ శాఖలు సమర్థవంతంగా, సమన్వయంతో వ్యవహరించాయని తలసాని చెప్పారు. విపత్తు సంభవించిన గంటన్నరలో దాదాపు 90 శాతం మేర పరిస్థితుల్ని చక్కదిద్దిన ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. ప్రజలు కూడా కొంత సహనం చూపాలని, అందుబాటులోని వనరులను బట్టి కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరణ పనుల్లో ఆలస్యం కావొచ్చని పేర్కొన్నారు.
సహాయక చర్యలపై సీఎం ఎప్పటికప్పుడు అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారని చెప్పా రు. ఇక జడివాన బీభత్సం గురించి తెలియగానే తాను, డిప్యూటీ మేయర్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించామని మేయర్ రామ్మోహన్ పేర్కొన్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం వస్తుందని వాతావరణ శాఖ నుంచి సాయంత్రం 4.58 నిమిషాలకు సమాచారం అందిందని, కొద్దిసేపటికే జడివాన మొదలైందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇక వర్షం, ఈదురుగాలుల వల్ల 84 ఇళ్లు పాక్షికంగా, ఒక ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నాయని... వారందరికీ అవసరమైన సహాయం అందిస్తున్నామని హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు.