భూదందాపై విచారణకు ఆదేశించండి

భూదందాపై విచారణకు ఆదేశించండి - Sakshi


♦ చంద్రబాబుకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్

♦ విచారణలో మీరు నిర్దోషులుగా తేలితే

♦ అప్పుడు విలేకరులపై చర్యలు తీసుకోవచ్చని సూచన

 

 సాక్షి, హైదరాబాద్: రాజధాని భూ దురాక్రమణపై అన్ని ఆధారాలతో వార్తలు ప్రచురించిన సాక్షి దినపత్రికపైనా, టీవీపైనా చర్యలు తీసుకుంటామని గాండ్రిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా రాజధాని భూదందాపై విచారణకు ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. విచారణకు సీఎం ఎందుకు వెనకడుగువేస్తున్నారో చెప్పాలన్నారు. భూ దందాలో తాను, తన కుమారుడు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు నిర్దోషులని చంద్రబాబు, ఆయన అంతరాత్మ భావిస్తూ ఉంటే విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నారు. విచారణలో తామంతా నిర్దోషులని తేలితే అపుడు విలేకరులపై చర్యలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారన్నారు.   సాక్షిపైనే విచారణ జరిపిస్తారా?

 భూదందాపై సాక్షిలో వచ్చిన వార్తలపైనే విచారణ జరిపిస్తారా? లేక గతంలో మరి కొన్ని పత్రికల్లో మీ పార్టీ నేతలను ఉద్దేశించి ‘ఇసుకాసురులు’, ‘ఇసుకదొంగలు’ అని రాసిన విలేకరులపైనా చర్యలు తీసుకుంటారా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి బ్యాంకుల నుంచి వందల కోట్లు కొల్లగొట్టిన వైనంపై రాష్ట్ర , జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. అంతెందుకు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో మీరూ.. మీ రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయిన ఉదంతాలు టీవీల్లోనూ పత్రికల్లోనూ వచ్చాయి. ‘మన వాళ్లు బ్రీఫ్‌డ్‌మి.. వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్’ అంటూ మీరు చెప్పిన మాటలు ప్రసారం చేసిన టీవీ చానెళ్లు, ప్రచురించిన పత్రికలపై కూడా చర్యలు తీసుకుంటారా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు.  సాక్షిలో ప్రచురితమైనవన్నీ మంత్రులు చేసుకున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగానే అనే విషయం గుర్తించాలన్నారు. ఈ పత్రాలు అమెరికా, రష్యాలోని డాక్యుమెంట్లు ఎంత మాత్రం కాదన్నారు.   ఏ భూములను రాసిస్తారు?

 రాజధాని ప్రాంతంలో భూములను కొని ఉంటే తాము రాసిస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని శ్రీధర్‌రెడ్డి అన్నారు. ‘ముఖ్యమంత్రి గారూ... ఏ భూములను రాసిస్తారు? మీ బినామీ వేముల రవికుమార్ కొనుగోలు చేసినవా? మీ మంత్రి నారాయణ పెద బామ్మర్ది సాంబశివరావు కొన్నవా? లేక ఆయన చిన బామ్మర్ది మునిశంకర్ కొన్న భూములా? లేదంటే మీ మంత్రి గారికి అత్యంత సన్నిహితురాలు, మా సోదరి సమానురాలు అయిన పొత్తూరి ప్రమీల గారు కొన్న భూములు రాసిస్తారా? పయ్యావుల కేశవ్ కొన్నవా? మీ ఎంపీ మురళీ మోహన్ గారి ఆస్తులా? మీ మంత్రి రావెల కిశోర్‌బాబువా? మీ లింగమనేని ఎస్టేట్స్ భూములు రాసిస్తారా? మీ మంత్రి పుల్లారావు బినామీ పేర్లతో కొన్న భూములు రాసిస్తారా? చెప్పండి అంటూ ప్రశ్నించారు.అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్‌మెంట్‌లో ఉన్నాయని ముఖ్యమంత్రి చెబుతున్నారని అవి దర్యాప్తు సంస్థల ఆధీనంలోకి వ చ్చింది ఇటీవలనే.. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లయిందని శ్రీధర్‌రెడ్డి గుర్తు చేశారు. ఇవి అటాచ్డ్ కాక ముందు మీరు, మీకుమారుడు హాయ్‌ల్యాండ్(అగ్రిగోల్డ్) ఆస్తులు దోచుకునేందుకు మాట్లాడుకున్న మాట నిజమా? కాదా? చెప్పాలన్నారు. అటాచ్డ్‌లో ఉన్నాయని చెబుతున్న ఆస్తులు మంత్రి పుల్లారావు ఆయన సతీమణి వెంకాయమ్మ పేరుతో ఎలా కొన్నారో చెప్పాలన్నారు.

 

 ఆ రైతులే కోటీశ్వరులయ్యే వారు కదా?

 రాజధాని ప్రాంత రైతులకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని శ్రీధర్‌రెడ్డి అన్నారు. జోన్ 1, జోన్ 2 ప్రాంతంలో భూములున్న రైతులు వ్యవసాయం మాత్రమే చేసుకోవాలని నిర్దేశించి, కమర్షియల్ జోన్లలో మాత్రం చంద్రబాబు, ఆయన మంత్రుల బినామీలు భారీగా భూములను కొనుగోలు చేశారన్నారు. జోన్ 3 ప్రాంతంలో ఉండే రైతులకు అక్కడ రాజధాని వస్తుందని ముందుగా తెలియజేసి ఉంటే వారి భూములను తక్కువకు అమ్ముకుని ఉండే వారా? తరాలుగా ఆ భూములను నమ్ముకుని ఉన్న రైతులకు ఈ విషయం తెలిసి ఉంటే ఇపుడు కోటీశ్వరులయ్యే వారు కదా? అని శ్రీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top