గ్రేటర్‌లో సమ్మె సైరన్ | Interact strike Siren | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో సమ్మె సైరన్

Dec 27 2013 4:58 AM | Updated on Sep 2 2017 1:59 AM

గ్రేటర్‌లో సమ్మె సైరన్

గ్రేటర్‌లో సమ్మె సైరన్

జీహెచ్‌ఎంసీ సేవలన్నీ శుక్రవారం నుంచీ నిలిచిపోనున్నాయి. జీహెచ్‌ఎంసీ గుర్తింపు యూనియన్ జీహెచ్‌ఎంఈయూ పిలుపు మేరకు ‘గ్రేటర్’లో పనిచేస్తున్న.

సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ సేవలన్నీ శుక్రవారం నుంచీ నిలిచిపోనున్నాయి. జీహెచ్‌ఎంసీ గుర్తింపు యూనియన్ జీహెచ్‌ఎంఈయూ పిలుపు మేరకు ‘గ్రేటర్’లో పనిచేస్తున్న సిబ్బందిలో దాదాపు ఇరవైవేల మంది నిరవధికంగా విధులకు డుమ్మాకొట్టి సమ్మెలో పాల్గొననున్నారు. ఫలితంగా చెత్త తరలింపు.. వీధులూడ్చటం.. దోమల నివారణ మందులు చల్లడం.. తదితర సేవలన్నీ స్తంభించనున్నాయి. మునిసిపల్ పరిపాలన, పట్ణణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ మేరకు ఈ నెల 10వ తేదీ నాటికి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనం నెలకు రూ.16,500కి పెంచాల్సి ఉండగా పెంచలేదని జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్, గౌరవాధ్యక్షుడు అమరేందర్‌లు విలేకరులకు తెలిపారు.

మెగాసిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ తదితర హామీలు అమలుకు నోచుకోనందున గురువారం అర్ధరాత్రి నుంచే సమ్మెలో పాల్గొననున్నట్లు వివరించారు. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులందరికీ హెల్త్‌కార్డులు, పారిశుధ్య విభాగంలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఈఎఫ్‌ఏలకు ఇంధన అలవెన్సు, కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, రెయిన్‌కోట్లు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, ఇన్సూరెన్స్ సదుపాయాలు తదితరమైనవి యూనియన్ డిమాండ్లలో ఉన్నాయి.
 
కొనసాగుతున్న ఇంజనీర్ల నిరసన
 
మరోవైపు సర్వసభ్య సమావేశంలో తమకు జరిగిన అవమానానికి నిరసనగా జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు ప్రారంభించిన నిరసన కొనసాగుతోంది. గురువారం సామూహిక సెలవులతో విధులకు హాజరుకాని ఇంజనీర్లు.. శుక్రవారం సైతం సామూహిక సెలవు పెట్టి గైర్హాజరు కానున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement