సాలూరు: రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇంటిఎదుట గిరిజన గురుకులాల అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులు శుక్రవారం ధర్నా చేశారు. మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సుమారు 15 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులను ఉన్నపళంగా తొలగించడం దారుణమన్నారు. అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు న్యాయం చేసేవరకు కదిలేది లేదంటూ బైఠాయించారు. పెద్దఎత్తున ధర్నా నిర్వహించి ‘మాకు న్యాయం చేయండి.. మా ఉద్యోగాల్ని కాపాడండి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
టీచర్ల కష్టాన్ని విస్మరిస్తే.. ప్రశ్నలు గుమ్మం దాటి ప్రజల తీర్పుగా మారతాయని అల్టిమేటం జారీ చేశారు. తమకు బూటకపు హామీలతో పనిలేదని.. న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో డీఎస్సీ–2025 వల్ల తమ ఉద్యోగ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుండటంతో సుమారు 40 రోజులుగా ఆందోళనలు చేస్తున్నామన్నారు. ఆ సందర్భంలో మంత్రి సంధ్యారాణి ఎవరి ఉద్యోగాలు తొలగించబోమని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఈ ఏడాది 1,456 మంది అవుట్‌సోర్సింగ్ టీచర్లను రెన్యువల్స్ చేయాల్సి ఉండగా, 788 మందికి తొలివిడతలో రెన్యువల్ చేశామని చెప్పి 532 మందికి మాత్రమే రెన్యువల్ ఆర్డర్స్ ఇచ్చారని తెలిపారు. అందరికీ రెన్యువల్ ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి యూనియన్ నాయకులతో మాట్లాడారు. 216 మందిని నాన్ టీచింగ్‌లో సర్దుబాటు చేస్తున్నామని, మిగిలిన వారి కోసం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కు ఫైలు పంపామని, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఏ తేదీకి ఎప్పుడు చేస్తారో తెలపలేదని, అందరికి న్యాయం చేయాలని మంత్రిని కోరినట్టు యూనియన్ నాయకులు తెలిపారు. మంత్రి హామీ మేరకు ధర్నాను తాత్కాలికంగా విరమించామన్నారు.


