
‘మహా’ ఒప్పందంపై నిరసనకు కాంగ్రెస్ కసరత్తు
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకోబోతోన్న ఒప్పందాలకు వ్యతిరేకంగా ఈనెల 23న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
గాంధీభవన్‌లో ముఖ్య నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకోబోతోన్న ఒప్పందాలకు వ్యతిరేకంగా ఈనెల 23న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు ఆదివారం గాంధీభవన్‌లో సమావేశమై నిరసన కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్షించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కతో పాటు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్రతో చేసుకోబోయే ఒప్పందాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోనుందని, ఈ విషయాన్ని ఇప్పటికే వాస్తవ జలదృశ్యం పేరుతో కాంగ్రెస్ వివరించిందని నేతలు పేర్కొన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని తీర్మానించారు. గ్రామీణ ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యేలా ఏర్పాటు చేయాలని పార్టీ కేడర్‌ను ఆదేశించారు.