ప్రభుత్వోద్యోగులకు శిక్షణ తరగతులు | Government Employees to Training classes | Sakshi
Sakshi News home page

ప్రభుత్వోద్యోగులకు శిక్షణ తరగతులు

Apr 22 2016 12:58 AM | Updated on Sep 3 2017 10:26 PM

‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ నినాదమే ఇతివృత్తంగా రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రూ.30 కోట్లు కేటాయింపు.. ఈ నెలాఖరు నుంచే శిక్షణ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ నినాదమే ఇతివృత్తంగా రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులతో వరుసగా మూడు రోజుల పాటు ఈ తరగతులు నిర్వహించనుంది. బంగారు తెలంగాణ లక్ష్యసాధనలో ఉద్యోగులను మరింత కార్యోన్ముఖులను చేయాలనే బృహత్ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఉద్యోగులందరికీ శిక్షణ ఇప్పించేందుకు రూ.30 కోట్లు కేటాయించారు. దీంతో ఈ నెలాఖరు నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. ముందుగా సచివాలయ ఉద్యోగులకు మానవవనరుల అభివృద్ధి సంస్థలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, వివిధ రంగాల్లో అప్పట్లో జరిగిన దోపిడీ, ఆ పరిస్థితులను అధిగమించేందుకు కొత్త రాష్ట్రంలో దృష్టి సారించాల్సిన అంశాలను ఈ శిక్షణలో ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నారు.

నీళ్లు.. నిధులు.. నియామకాలకు సంబంధించి ఆయా రంగాల్లో నిపుణులను రప్పించి వారితో ఉపన్యాసాలు ఇప్పించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఉద్యోగుల్లో ఆయా రంగాల్లో అవగాహన పెరిగి వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు తీరు మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement