ఉద్యోగుల స్థానిక కేడర్‌పై ఉత్తర్వులు | Orders on local cadre of employees in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల స్థానిక కేడర్‌పై ఉత్తర్వులు

Jul 7 2026 5:48 AM | Updated on Jul 7 2026 5:48 AM

Orders on local cadre of employees in Andhra Pradesh

26 జిల్లాలు, ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్‌ల వారీగా పోస్టులు కేటాయింపు

రాష్ట్ర స్థాయి పోస్టులు మల్టీ జోనల్‌ కేడర్‌లుగా మార్పు.. డిప్యూటీ కలెక్టర్, డీఎస్‌పీ, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ పోస్టులు మల్టీ జోన్‌లోకి

జిల్లా, జోన్, మల్టీ జోన్‌ల స్థానిక కేడర్‌ల మధ్య కేడర్‌ బలాన్ని నిర్ధారించి పంపిణీ

స్థానిక కేడర్‌ కేటాయింపు పూర్తయ్యే వరకు కొత్త నియామకాలపై నిషేధం

కొత్త పోస్టుల సృష్టి, పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లపైనా నిషేధం

మార్కాపురం, పోలవరం జిల్లాలకు మినహాయింపునిస్తూ సీఎస్‌ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 26 జిల్లాలు, ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్‌లు, 72 డివిజిన్‌ల వారీగా కేడర్‌ సంఖ్య నిర్ధారించడం, అమలు మార­్గదర్శకాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు వెలు­వరించారు. ప్రస్తుత ఉద్యోగుల స్థానిక కేడర్‌ను వివిధ విభాగాధిపతులు నిర్ధారణ చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జిల్లా, జోన్, మల్టీ జోన్‌ స్థానిక కేడర్‌ల మధ్య కేడర్‌ బలాన్ని నిర్ధారించడంతో పాటు పంపిణీ చేయనున్నారు. స్థానిక కేడర్‌ కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని శాఖలలో పోస్టుల సృష్టి, పోస్టులు ఉన్నతీకరణ, కొత్త నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లపై నిషేధం విధించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, స్థానిక కేడర్‌ పంపిణీ వర్తించదు. ఈ జిల్లాలకు ఉద్యోగులను తాత్కాలిక కేటాయింపులు చేస్తారు.

ఇప్పటి వరకు  రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉన్న డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్,  కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌ తదితర సారూప్య కేటగిరీల పోస్టులు మల్టీ జోన్‌ కేడర్‌లుగా ఏర్పాటయ్యాయి. అందుకనుగుణంగా అటువంటి కేటగిరీల పోస్టులు మంజూరైన బలం, రాష్ట్రపతి ఉత్తర్వులు 2025, మార్గదర్శకాల నిబంధనలకు అనుగుణంగా మల్టీజోన్‌–1, మల్టీజోన్‌–2 మధ్య పంపిణీ చేయాలి.
⇒ సచివాలయ శాఖలు, శాఖాధిపతుల ఆధ్వర్యంలో వివిధ స్థాయిలలో పనిచేస్తున్న కార్యాలయాలలో, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు /సంస్థలు /స్థాపనలలో మంజూరైన అన్ని వర్గాల పోస్టులకు (శాశ్వత, తాత్కాలిక, సూపర్‌ న్యూమరరీ పోస్టులతో సహా) ఉత్తర్వులు వర్తిస్తాయి.

⇒ రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీస్‌ అధికారులు, గ్రూప్‌ ‘ఏ’, గ్రూప్‌ ‘బి’ అధికారులుగా నిర్వహిస్తున్న పోస్టులు, న్యాయాధికారులుగా నిర్వహిస్తున్న పోస్టులు, శాసనసభ సచివాలయం, గవర్నర్‌ సచివాలయంలోని పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, జిల్లా, ఇతర న్యాయస్థానాలలోని పోస్టులు, ప్రభుత్వ రంగ సంస్థలలోని పోస్టులు, సిబ్బందికి ఈ మార్గదర్శకాలు వర్తించవు. సచివాలయ విభాగాలు, విభాగాధిపతుల కార్యాలయాలు, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, సంస్థలు, వ్యవస్థలు కేడర్‌ బలాన్ని నిర్ణయించడం నుంచి  మినహాయిస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వు 2025లోని నిబంధనలు ఈ కార్యాలయాలకు వర్తించవు.
⇒ కేడర్‌ బలం ప్రస్తుతం ఉన్న ఖాళీలను తీసివేయడం ద్వారా నిర్ధారించాలి. డిప్యుటేషన్, సెలవు, శిక్షణ లేదా సస్పెన్షన్‌లో ఉన్న వ్యక్తుల పోస్టులను భర్తీ చేయబడిన పోస్టులుగా పరిగణించాలి. వాటిని ఖాళీలుగా లెక్కించరాదు.

⇒ కేడర్‌ బలం, పని బలం పంపిణీ కోసం పోస్టుల కేటాయింపు నిష్పత్తులు ఉదాహరణకు ఇలా ఉంటాయి. పూర్వపు కృష్ణా జిల్లా హెచ్‌ఒడీలో పోస్టుల కేటాయింపు నిష్పత్తులు  ‘‘కృష్ణా : ఎన్టీఆర్‌ : ఏలూరు :: 40 : 50 : 10గా నిర్ధారించవచ్చు.  40 శాతం పోస్టులు పునర్వ్యవస్థీకరించబడిన కృష్ణాకు, 50 శాతం పునర్వ్యవస్థీకరించబడిన ఎన్టీఆర్‌కు, 10 శాతం పునర్వ్యవస్థీకరించబడిన ఏలూరుకు కేటాయించాలి.

⇒ విభాగాధిపతి మార్గదర్శకాల మేరకు పునర్వ్యవస్థీకరించబడిన స్థానిక ప్రాంతాలలో కేటాయించదగిన కేడర్‌ బలాన్ని పంపిణీ చేయాలి. ఆ తరువాత విభాగాధిపతి ఆదేశాలకు అనుగుణంగా సిబ్బందిని పునర్వ్యవస్థీకరించబడిన స్థానిక ప్రాంతాలలో పంపిణీ చేయాలి. ఈ కార్యకలాపాలు నిర్దేశిత ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించాలి. దీని కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేస్తుంది.
⇒ విభాగాధిపతి  కేడర్‌ బలం, పని చేసే సిబ్బంది తుది కేటాయింపు ప్రతిపాదనను రూపొందించి సంబంధిత సచివాలయ విభాగానికి సమర్పించాలి. సంబంధిత కార్యదర్శి ఆ ప్రతిపాదనను పరిశీలించి రాష్ట్రపతి ఉత్తర్వు 2025కు అనుగుణంగా ఉందని నిర్ధారించుకుని ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపాలి.
⇒ సచివాలయ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యదర్శులు, అన్ని శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, ప్రాంతీయ, జిల్లా అధిపతులు ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement