ఉమ్మడి లక్ష్యాలకు పీఎస్సీల సదస్సు | Sakshi
Sakshi News home page

ఉమ్మడి లక్ష్యాలకు పీఎస్సీల సదస్సు

Published Tue, Feb 2 2016 1:06 AM

ఉమ్మడి లక్ష్యాలకు పీఎస్సీల సదస్సు - Sakshi

♦ హాజరుకానున్న యూపీఎస్సీ, అన్ని రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్లు
♦ ఉత్తమ విధానాలు, సంక్షేమ అంశాలపై విస్తృత చర్చలు
♦ ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా సీఎం, గవర్నర్
♦ విలేకరుల సమావేశంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
 
 సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ)ల ఉమ్మడి లక్ష్యాల (అవకాశాలు, ఆవిష్కరణలు, చేపట్టాల్సిన చర్యల)పై చర్చించేందుకు తమ సంస్థ అధ్వర్యంలో 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో పీఎస్సీల చైర్మన్ల 18వ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. యూపీఎస్సీ చైర్మన్ దీపక్ గుప్తా అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్లు, కొన్ని రాష్ట్రాలకు చెందిన సభ్యులు హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న తొలి సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు, సదస్సులో చర్చకు రానున్న అంశాల గురించి సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చక్రపాణి వివరించారు. 1949 నుంచి వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఇటువంటి సదస్సుల ద్వారా పీఎస్సీల గత అనుభవాలు, ఉమ్మడి అవసరాలు (కొత్త టెక్నాలజీ, పరీక్షలకు సిలబస్), భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకునేందుకు తాజా సదస్సులో వీలు కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే హైదరాబాద్‌లో సదస్సు నిర్వహణకు యూపీఎస్సీ చైర్మన్ అంగీకరించారన్నారు. ఆయా రాష్ట్రాల పీఎస్సీలు అవలంబిస్తున్న విధానాలతోపాటు కమిషన్ల సభ్యుల సంక్షేమానికి (జీతభత్యాలు, పదవీ విరమణ వయసు..తదితర) సంబంధించిన అంశాలపైనా, రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ కోర్టుల మాదిరిగా రక్షణ లేదంటూ సభ్యుల్లో నెలకొన్న అభిప్రాయంపైనా చర్చించనున్నట్లు తెలిపారు.
 
 ఏర్పాట్లు పూర్తి
 సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు (చిలుకూరు సమీపంలోని ప్రగతి రిసార్ట్స్‌లో) చేశామని ఘంటా చక్రపాణి తెలిపారు. 4వ తేదీన ఉదయం 9.30 గంటలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభిస్తారని... అదే రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే ముగింపు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. 5వ తేదీన పీఎస్సీలకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతాయన్నారు.

 పోటీ పరీక్షలను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు పీఎస్సీల అవసరాలు, ఐటీ నిపుణుల వద్ద ఉన్న అవకాశాలను పర స్పరం తెలుసుకునేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థల ప్రతినిధులతో పీఎస్సీల చైర్మన్లు టి-హబ్‌లో సమావేశం కానున్నట్లు చక్రపాణి తెలిపారు. విలేకరుల సమావేశంలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్, సభ్యులు విఠల్, మన్మథరెడ్డి, చంద్రావతి, సాయిలు, మతీనుద్దీన్ ఖాద్రీ, విద్యాసాగర్‌రావు, రాజేందర్, రామ్మోహన్‌రెడ్డి, వివేక్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement