
ప్రచారానికి చలిదెబ్బ
తలకు మంకీ క్యాప్.. శరీరానికి ఉలెన్ స్వెట్టర్... దానిపైన రెక్సిన్ కోట్.. చేతులకు గ్లౌజులు... కాళ్లకు సాక్స్‌లు...
కుత్బుల్లాపూర్: తలకు మంకీ క్యాప్.. శరీరానికి ఉలెన్ స్వెట్టర్... దానిపైన రెక్సిన్ కోట్.. చేతులకు గ్లౌజులు... కాళ్లకు సాక్స్‌లు... ఉదయం పూట ఏ రాజకీయ నాయకుని ఇంటి వద్ద చూసినా ఈ తరహావేషధారణతో గుంపులు గుంపులుగా కదిలి వచ్చే ఇలాంటి కార్యకర్తలే కనిపిస్తున్నారు. కొద్ది రోజులుగా నగరంలో చలి గాలులు ప్రజలను వణికిస్తుండడం... రాజకీయ వర్గాలను కలవర పరుస్తున్నాయి. ఉదయం వేళల్లో చలి మరింత ఎక్కువగా ఉంటోంది.
ఈ చలిలో ఉదయం... సాయంత్ర వేళల్లో ప్రచారం చేయడం నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందిగా మారింది. లేచీ లేవగానే తమ నాయకులను దర్శించుకునే అనుచరగణాలను ఇది మరింత ఇబ్బందికి గురిచేస్తోంది. సాధారణంగా అక్టోబర్ నుంచి జనవరి మాసాంతం వరకు జంటనగరాలలో చలి తీవ్రత ఉంటుంది. జనవరిలో మరింత ఎక్కువగా చలి గాలులు వీస్తాయి. ఇలాంటి సమయంలో ఎన్నికలు రావడంతో వణుకుతూనే నాయకులు ప్రచారానికి బయలుదేరక తప్పని పరిస్థితి ఎదురైంది.