జూలై 10 నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం రష్యాలో పర్యటిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు.
హైదరాబాద్ : జూలై 10 నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం రష్యాలో పర్యటిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. రష్యాలో అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ఇన్నోప్రోమ్‌లో సీఎం పాల్గొంటారని చెప్పారు. పారిశ్రామిక ప్రదర్శనకు భారత్ నుంచి ఏపీ, మహారాష్ట్ర, రాజస్ధాన్ సీఎంలు హాజరవుతారని వివరించారు. ఇందులో సీఎం మూడు కీలక ఉపన్యాసాలు చేస్తారని చెప్పారు.
రష్యా పర్యటనకు ఒక్క రోజు ముందు కొత్తగా నిర్మించిన కజకిస్థాన్ రాజధాని ఆస్తానాను సీఎం సందర్శిస్తారని వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్, జోనింగ్ జరిగినప్పటికీ ఆస్తానాను నిర్మాణ విధానాన్ని పరిశీలిస్తారని తెలిపారు. ఈ నెల 12న రష్యాలో ముఖ్యనేతలు, పారిశ్రామికవేత్తలతోనూ సీఎం ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారని చెప్పారు. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు రష్యా పర్యటన సాగుతుందని ప్రభాకర్ వివరించారు.