వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారినపడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సోమవారం హైకోర్టుకు నివేదించాయి.
వడదెబ్బలపై హైకోర్టుకు ఉభయ రాష్ట్రాల నివేదన
సాక్షి, హైదరాబాద్: వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారినపడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సోమవారం హైకోర్టుకు నివేదించాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కార్మికులు ఎండలో పనిచేయకుండా చర్యలు చేపట్టినట్లు ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ చెప్పారు. ప్రజల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల విషయంలో అధికారులకు తమ ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ కోర్టుకు తెలిపారు. ఇప్పటికే పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించారన్నారు.
వారి ప్రకటనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వడగాడ్పులపై దాఖలైన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వడదెబ్బ మృతులకు పరిహారం చెల్లింపు విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వాలకు సూచించింది. వడదెబ్బ వల్ల ఏటా మరణాలు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీశైలం యాదవ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.